Posted [relativedate]
నందమూరి బాలకృష్ణ రాయలసీమ ఫ్యాక్షన్ సినిమాల్లో డైలాగుల్ని మించిపోయాయి రేవంత్ రెడ్డి కామెంట్లు. తెలంగాణ వచ్చినప్పట్నుంచీ కేసీఆర్ అంటేనే అంతెత్తున్న లేస్తున్న రేవంత్ రెడ్డి.. చాలాసార్లు గులాబీ బాస్ ను తట్టుకోలేని విధంగా విమర్శించారు. అందరూ కేసీఆర్ విమర్శలకు భయపడితే.. కేసీఆర్ మాత్రం రేవంత్ రెడ్డి విమర్శలకు తట్టుకోలేరని ఛలోక్తులు కూడా ప్రచారంలోకి వచ్చాయి. మరోసారి తనదైన శైలిని ప్రదర్శించిన రేవంత్ రెడ్డి ఏకంగా కేసీఆర్ సొంతూరు చింతమడకలోనే తొడ గొట్టాలని డిసైడయ్యారు.
అనుకున్నట్లుగానే రేవంత్ చింతమడక బయల్దేరడంతో.. పోలీసులు నానా హైరానా పడ్డారు. అతి కష్టం మీద సిద్ధిపేటలోనే ఆపేశారు. కానీ రేవంత్ రెడ్డి అంతటితో ఆగలేదు. రోడ్డు మీద పరుగులు పెట్టారు. పోలీసుల్ని తోసుకుని ముందుకెళ్లారు. ఓవైపు రేవంత్.. మరోవైపు టీడీపీ కార్యకర్తలు.. అటు వైపు పోలీసులు సిద్ధిపేట రోడ్ల మీద జరిగిన ఈ ఛేజింగ్ సీన్.. స్థానికులకు మంచి వినోదం పంచింది. ఏదో విధంగా రేవంత్ ఆపిన పోలీసులకు ఝలక్ ఇచ్చిన ఆయన.. ఖాకీల కళ్లు గప్పి చింతమడక బయల్దేరారు.
ఆలస్యంగా విషయం తెలుసుకున్న పోలీసులు.. సీతారాంపల్లిలో మళ్లీ ఆపేశారు. అయితే చింతమడకలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించనిదే కదిలేదని లేదని రేవంత్ భీష్మించడంతో.. పోలీసులు రైతు కుటుంబాన్నే అక్కడకు తీసుకొచ్చారు. టీడీపీ తరపున వారికి ఆర్థిక సాయం చేసిన రేవంత్.. త్వరలోనే చింతమడకలో సభ పెడతానని, కేసీఆర్ ను చీరి చింతకు కడతానని శపథం చేయడం మరింత ఆసక్తికరంగా మారింది. మందబలం ఉండి కూడా కేసీఆర్ కు భయపడుతున్న కాంగ్రెస్.. సింగిల్ గా ఢీకొంటున్న రేవంత్ ను చూసి బుద్ధి తెచ్చుకోవాలని పరిశీలకులు చెబుతున్నారు.