Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రభుత్వ ఉద్యోగాల్లో సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు వచ్చి పైస్థానాలకు వెళుతుంటారు. ఆయా ఉద్యోగాలకు నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఉద్యోగులు ఎదుగుతుంటారు. కాని రాజకీయాల్లో ఎదగడానికి ఏ నిబంధనలూ ఉండవూ. డిపార్ట్మెంటల్ టెస్టులూ ఉండవూ. ఎవరు చురుగ్గా ఉంటారో, ఎవరు ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేస్తారో, ఎవరు ప్రత్యర్థులపై దూకుడుగా వ్యవహరిస్తారో, ఎవరు వాగ్ధాటి చూపించగలరో… అలాంటివారు పార్టీలో నాయకులుగా ఎదుగుతుంటారు.
రాజకీయాల్లో సీనియారిటీ పనిచేయదు. సీనియర్ నేతలు ఏళ్ల తరబడి ఉన్నచోటనే ఉండొచ్చు. నిన్నా మొన్నా పార్టీలో చేరినవారు అమాంతం ఎదిగిపోవచ్చు. రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఎలా రాణిస్తారో చెప్పలేం. తెలంగాణ టీడీపీలో చాలామంది కంటే ఫైర్‌బ్రాండ్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి జూనియర్. కాని ఇప్పుడు ఆయన అధినేత చంద్రబాబునే మించిపోయారు. ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో రేవంత్ రెడ్డి అంటున్నారు. తెలంగాణ టీడీపీ అంటే రేవంత్ పార్టీ అనేవిధంగా తయారైంది. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు చేరినవారిలో మిగిలిపోయిన కొద్దిమంది ప్రస్తుతం గమ్మున ఉన్నారు.
తెలంగాణ పార్టీకి అధ్యక్షుడు ఎల్.రమణ అయినప్పటికీ ఆ విషయం ఎక్కువమందికి తెలియదు. ఒక్కమాటలో చెప్పాలంటే రేవంత్ పార్టీని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఢీకొంటున్న ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ తరువాత ముఖ్యమంత్రి అయ్యే అర్హతవున్న నాయకుడు ఈయనేనని ఈమధ్య ఓ సర్వే తెలియచేసింది. పార్టీలో ఈ యువ నాయకుడి దూకుడు తట్టుకోలేక, అతనికి పెరగుతున్న ఆదరణను సహించలేక కొందరు నాయకులు పార్టీ నుంచి వెళ్లిపోయారు.