Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణలో మూడు స్కాములు, ఆరు కుంభకోణాలు అన్నట్లుగా కేసీఆర్ పాలన ఉందన్నారు రేవంత్ రెడ్డి. మొన్నటికి మొన్నే మోడీ పాలన లాగే తమ పాలనలో అవినీతి లేదని గొప్పలు చెప్పుకున్న సీఎం.. మియాపూర్ ల్యాండ్ స్కామ్ చూసి ఏమంటారని టీటీడీపీ నేత రేవంత్ ప్రశ్నిస్తున్నారు. 17వేల ల్యాండ్ స్కామ్ వెనుక అధికార గద్దలు ఉన్నాయని చెబుతున్నారు.
ఎంసెట్ లీకేజ్, నయీమ్ ఎన్ కౌంటర్, మియాపూర్ ల్యాండ్ స్కామ్.. ఈ మూడు వ్యవహారాల్లోనూ పెద్దస్థాయిలో గూడుపుఠాణీ సాగిందని, అందుకే సీఐడీ ఎంక్వైరీ చేసి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు. ఏ ఒక్క అంశంలో సీబీఐ ఎంక్వైరీ వేసినా.. కేసీఆర్ జైలుకు వెళతారని చెబుతున్నారు రేవంత్. సీఎంఓ ఆఫీస్ కు అన్నీ తెలిసినా తొక్కిపట్టిందని ఆరోపించారు.
స్కామ్ బయటపడ్డాక, మీడియాలో వార్తలు వచ్చాక డిప్యూటీ సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేసీఆర్.. బాగానే షో చేశారని రేవంత్ మండిపడ్డారు. అసలు డిప్యూటీ సీఎంకు పేరుకే పదవి అని, అంతా కేసీఆర్ చక్రం తిప్పుతున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ సమీక్షలకు విలువ లేదని, నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్ రావును పిలిపించుకుని రివ్యూ చేయడమే అందుకు నిదర్శనమన్నారు రేవంత్.