తెలంగాణాలో తెలుగుదేశం ఆశా కిరణం రేవంత్ రెడ్డి వాయిస్ మళ్ళీ రైజ్ అవుతోంది. MLC ఎన్నికల వ్యవహారం,కేసులు,నేతల ఫిరాయింపుల వ్యవహారం..ఇలా చక చక సాగుతున్నపరిణామాలు మధ్య ఆయన గొంతు మళ్ళీ ఫైరైంది? మల్లన్నసాగర్ రిజర్వాయర్ కింద నిర్వాసితులకు సంఘీభావంగా రెండ్రోజుల దీక్ష చేసిన రేవంత్ పూర్వస్థాయిలో TRS మీద అస్త్రాలు సంధించారు…టీడీపీ నేతలేకాదు,కాంగ్రెస్ నాయకులు కూడా చాలామంది పొలోమంటూ TRS వైపు దూకుతున్నవేళ ఆయనలో ధైర్యం ఎక్కడనుంచి వచ్చింది? అమరావతిలో బిర్యాని తిన్నగాడిదకొడుకు ఎవరని బహిరంగంగా ముఖ్యమంత్రి గురించి వ్యాఖ్యానించేంత తెగింపు ఎలా వచ్చింది? ఏకపక్షంగా సాగుతున్న తెలంగాణ రాజకీయాలలో మళ్ళీ గళం విన్పిస్తున్న రేవంత్ వ్యూహం ఏంటి? ఈ ప్రెశ్నలకి కొన్ని సమాధానాలు చెప్పే ప్రయత్నమే ఇది…….
రెండేళ్లుగా తెలంగాణ రాజకీయాలు ఏకపక్షంగా సాగిపోతున్నాయి .MLC కొనుగోలు కేసు వ్యవహారం
బయటపడేదాకా వెనుక ఉన్న MLA ల సంఖ్య చూసుకొని టీడీపీ కాస్త ధైర్యంగానే ఉంది .ఆకేసుతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఇక GHMC ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీ కి దింపుడు కళ్లెం ఆశలు కూడా చచ్చిపోయాయి.రాజకీయ రణక్షేత్రంలో ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ మౌన సాక్షిలా నిలబడింది. చూస్తూ ఊరుకొంటే పోనిలే అనుకుంటుందా రాజకీయం? తెలుగుదేశం దాదాపు ఖాళీ అయ్యాక సీఎం కేసీఆర్ కన్ను కాంగ్రెస్ మీద పడింది .తెలంగాణ ఇచ్చామన్న ధైర్యంతో కాంగ్రెస్ కాస్త ప్రతిఘటన చూపిద్దామనుకొంది కానీ కేసీఆర్ రాజకీయ తంత్రం ముందు ఆ పప్పులులేమి ఉడకటం లేదు. కాంగ్రెస్ హై కమాండ్, తెలంగాణ నాయకత్వం మధ్య ఎన్ని చర్చలు జరిగినా ..ఎన్నివ్యూహాలు పన్నినా..ఫలితం పెద్దగా లేదు అని చెప్పుకోవాలి .. రాజకీయంగా ,ఆర్ధికంగా కాంగ్రెస్ కావడిని పూర్తిగా భుజానెత్తుకొనే నాయకుడు కనిపించడం లేదు..ఆ ఖాళీని ఎవరు భర్తీ చేయాలి.?
ఒక దశలో తెలుగుదేశం తరుపున ఒంటరి పోరాటం కన్నా కాంగ్రెస్ కండువా కప్పుకొంటే మేలు అని రేవంత్ రెడ్డి పై కూడా అనుచరులు ఒత్తిడి తెచ్చారు.ఆయన కూడా ఆ దిశగా ఆలోచించి ఉండవచ్చు.కాంగ్రెస్ పరిణామాలు చూశాక ఊరు మారినా తీరు మారదేమో అన్న సంశయం ఆయన లో మొదలైంది.ఇక తెలుగుదేశంలోనూ ఆయనకు పోటీ అనుకొన్న నాయకులు గులాబీ దండులో చేరిపోయారు.కొద్దిపాటి తలనొప్పులు ఉన్నా ఇటీవల జరిగిన అంతర్గత సమావేశాల్లో TDP యువనేత లోకేష్..ఈ అంశంపై క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది.పార్టీ కి ఇంతకన్నా జరిగేనష్టం ఏమి ఉండదు…. రేవంతే మన సేనాని అని లోకేష్ తేల్చి చెప్పారంట..
ఈ పరిణామాలతో కాస్త స్థిమిత పడ్డ రేవంత్ రెడ్డి మళ్ళీ పూర్యవైభవం కోసం పోరాట పంధా ఎంచుకోవాలని నిర్ణయించుకొన్నట్టుంది. కాంగ్రెస్ ఇలాగే బలహీన పడుతూ పోతే తెలంగాణాలో కుల సమీకరణాలు కూడా తనకు కలిసివస్తాయని ఆయన ఆశ…వ్యక్తిగత ఆశలు,ఆకాంక్షలు నేర్చుకోవడానికి చిత్తశుద్ధి,ప్రణాళికాబద్ధ వ్యవహార శైలి మేలు చేయవచ్చు .కానీ రాజకీయ క్షేత్రంలో వాటి ప్రభావం కొంత మేరకే.రాజకీయ
పెనుగాలులు,తుపానులు,సునామీలు ఎలాగైనా ఎటువైపు నుంచున్నా రావచ్చు..ప్రజాక్షేత్రం వాటి ప్రభావానికి లోనుగాకుండా నిలకడగా ఉన్నప్పుడే మన వ్యూహాలు ,పోరాటాలు పనిచేసేది.ఒకవైపు తెలంగాణా యువనికపై మేరునగ ధీరుడు కేసీఆర్… మరోవైపు ఆత్మ స్థైర్యం కోల్పోయిన ఆయన వ్యతిరేకులు… అప్పుడప్పుడు అసంతృప్త గళం వినిపిస్తున్నా ఆయుధం ఎంతవరకు పడతారో తెలియని కోదండరాం వంటి మేధావులు… ప్రజాక్షేత్రంలో గులాబీ దళంపై వ్యతిరేకత పెరిగితే తమకే కలిసొస్తుందన్న ఆశలో కాంగ్రెస్ వాదులు..ఇది ప్రస్తుతం తెలంగాణ రాజకీయ కోటకున్న నాలుగు గోడలు.ఈ రాజకీయ పద్మవ్యూహంలో రేవంత్ రెడ్డి అభిమన్యుడు అవుతాడో..అర్జునుడవుతాడో..?
*కిరణ్ కుమార్