కోతలతో విశాఖ బీచ్ అందాలకు బీటలు ..

0
497

  rishikonda beach vishaka స్వచ్ఛంగా…. సుందరంగా… సర్ఫింగ్‌కు అనుకూలంగా.. విదేశీ పర్యాటకులకు ఆటపట్టుగా ఉన్న రుషికొండ బీచ్‌ నేడు వెలవెలబోతోంది. ధ్వంసమైన చెలియలికట్ట.. పడిపోయిన విద్యుత్తు స్తంభాలు.. పేరుకుపోయిన చెత్తాచెదారాలతో బీచ్‌ కళావిహీనంగా తయారైంది. జనం రాకపోవటంతో వివిధ వ్యాపారాలపై ఆధారపడ్డ ఎన్నో కుటుంబాల ఉపాధికి గండి పడింది….

బీచ్‌ల కోత విశాఖ పర్యాటకంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సందర్శకులతో సందడిగా ఉండాల్సిన తీర ప్రాంతాలు కడలి ప్రకోపంతో వెలవెలబోతున్నాయి. మొన్న ఆర్కేబీచ్‌, ఇప్పుడు రుషికొండ తీరం సాగర కెరటాల తాకిడికి ధ్వంసమయ్యాయి. గత రెండు, మూడేళ్లుగా బీచ్‌ల కోత అధికారులకు తలనొప్పిగా తయారైంది. ఏడాది క్రితం ఆర్కేబీచ్‌లో అలల ఉద్ధృతికి రక్షణగోడతోపాటు కాలిబాట కూలిపోవడంతో దాదాపు ఆరు నెలలపాటు పర్యాటక రంగం కుదుపునకు లోనయింది. ప్రభుత్వ ఆదేశాలపై జిల్లా యంత్రాంగం రక్షణగోడ, కాలిబాటలను తాత్కాలికంగా పునరుద్ధరించాక సందర్శకుల సంఖ్య క్రమంగా పెరిగింది. ఇప్పుడు రుషికొండ బీచ్‌ అలల ఉద్ధృతికి కకావికలం కావడంతో గత పది రోజులుగా పర్యాటకులు అటు వైపు వెళ్లేందుకు సుముఖత చూపడం లేదు.

కొందరు వెళ్లినా ఎక్కువసేపు గడపడం లేదు. సముద్రం దాదాపు 150 అడుగులు ముందుకు రావడంతో కాలిబాటలు కొట్టుకుపోయాయి. విశాఖ నగరాన్ని ఏటా 45 లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు. మరో 5 లక్షల మంది విదేశీ పర్యాటకులు. వీరంతా ఎక్కువగా ఆర్కేబీచ్‌, రుషికొండ, భీమునిపట్నం, యారాడ బీచ్‌లకు వెళుతుంటారు. రుషికొండ బీచ్‌ జలక్రీడలకు ఎంతో అనువైన ప్రాంతం కావడంతో విదేశీయులతోపాటు పశ్చిమ బంగ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాలవారు ప్రాధాన్యమిస్తుంటారు. తాజా లెక్కల ప్రకారం రుషికొండ బీచ్‌ను ఏటా 25 లక్షలకుపైగా పర్యాటకులు సందర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక గత ఐదేళ్లలో రుషికొండ లో పర్యాటకుల సంఖ్య బాగా పెరిగింది. దీంతో ప్రభుత్వం కూడా ఇక్కడ జలక్రీడలకు ప్రాధాన్యమిస్తోంది. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో స్పీడు బోట్లను నిర్వహిస్తున్నారు.

రూ. 3 కోట్లతో ప్రభుత్వం బీచ్‌లో పర్యాటకుల కోసం మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. ఈ పనులు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. ఆర్కేబీచ్‌ తరహాలో రుషికొండను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకున్న దశలో ఈ ప్రాంతం కోతకు గురవ్వడం కలకలకం సృష్టిస్తోంది. సముద్రంలో దిగాక బయటకొచ్చి దుస్తులు మార్చుకునే పరిస్థితి లేదు. దీంతో సందర్శకుల సంఖ్య క్రమంగా తగ్గడంతో పర్యాటక రంగంపై ప్రభావం చూపుతోంది. రుషికొండ చుట్టూ ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, కాటేజీలకు వచ్చే వారి సంఖ్య తగ్గుతోంది. జరుగుతున్న విద్యంసం తో వ్యాపారాలు మూత పడే దుస్థితి బీచ్‌కు వచ్చే సందర్శకుల మీద ఆధారపడి చిన్న, చితక వ్యాపారం చేసి దాదాపు 2 వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. వీరంతా వ్యాపారాల్లేక ప్రస్తుతం లబోదిబోమంటున్నారు.

ఇక విశాఖను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తగు ఫలితాలివ్వాలంటే తీర ప్రాంత కోతలపై శాశ్వత పరిష్కారాన్ని చూపాలి. గతేడాది ఆర్కేబీచ్‌లో కురుసురా మ్యూజియం వద్ద తీరం భారీగా కొట్టుకుపోయినపుడు శాశ్వత పరిష్కారం కోసం ఎంతో హడావుడి చేసినా ఫలితం లేకపోయింది. శాశ్వత పరిష్కారం కోసం రూ. 3.50 కోట్లతో తయారు చేసిన ప్రతిపాదనలు ప్రభుత్వం వద్దే నిలిచిపోయాయి. ఇతర దేశాల తరహాలో జియోట్యూబ్‌ ఏర్పాటు, అండర్‌ వాటర్‌ డైక్స్‌ వంటివి నిర్మించాలన్న నిపుణుల సూచనలు కూడా అటకెక్కాయి. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని బీచ్‌కోతలపై శాశ్వత పరిష్కారాన్ని చూపగలిగితే పర్యాటక రంగానికి భరోసా కల్పించినట్లవుతుంది. లేకుంటే ఈ స్మార్ట్ సిటీ కి మరకలు తప్పవు….

Leave a Reply