ఆర్కే నగర్ ఉపఎన్నిక ఎందుకు రద్దైంది..?

0
474
rk nagar elections canelled

Posted [relativedate]

rk nagar elections canelledదేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన ఆర్కేనగర్ ఉపఎన్నిక ఊహించని విధంగా రద్దైంది. నేతలు పెద్దమొత్తంలో డబ్బు పంచినట్లు ఐటీ అధికారులు ప్రూఫులు చూపించడంతో.. ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్కేనగర్ దివంగత సీఎం జయ నియోజకవర్గం కావడం, ఇక్కడ శశికళ, పన్నీర్ వర్గాల మధ్య అమ్మ వారసత్వం కోసం పోటీ జరగడంతో.. ఇప్పుడు ఈసీ నిర్ణయం నేతలకు మింగుడుపడటం లేదు. పోయిన డబ్బులు పోగా.. మళ్లీ ఎప్పుడు ఉపఎన్నిక పెడతారో.. అప్పుడు సమీకరణాలు ఎలా ఉంటాయోనని తెగ మథనపడుతున్నారు.

జయ మరణించిన తర్వాత పన్నీర్ సెల్వంను సీఎం చేయడానికి అన్నివిధాలుగా ప్రయత్నించిన బీజేపీ.. ఇప్పుడు ఆర్కేనగర్లో కూడా వెనుక నుంచి చక్రం తిప్పుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఐటీని అడ్డం పెట్టుకుని ఈసీతో బాణం వేయించిందని శశికళ వర్గం ఆగ్రహంగా ఉంది. కానీ ఇప్పుడు మోడీని ఎధిరించేవారు ఎవరూ లేరు. అనవసరంగా నోరు జారితే.. మనకే లాస్ అని సరిపెట్టుకుంటున్నారు చిన్నమ్మ టీమ్. కానీ ఇప్పటివరకూ అంతో.. ఇంతో మోడీకి అనుకూలంగా ఉన్న తమిళ జనం కూడా.. అవినీతి పేరుతో బీజేపీ ఆడుతున్న డ్రామా శ్రుతి మించుతోందని ఆరోపిస్తున్నారు.

సాధారణంగా ఎవరైనా తెగే దాకా లాగుతారు. కానీ ఆర్కేనగర్లో బీజేపీ మాత్రం తెగిన తర్వాత కూడా లాగుతోందని విమర్శలు వస్తున్నాయి. పన్నీర్ సెల్వాన్ని సీఎం కాకుండా అడ్డుపడ్డారనే కారణంతో.. సీఎం పళనిస్వామి సహా.. అప్పట్లో ముఖ్యమంత్రి పదవికి పోటీపడ్డ దిండిగల్ శ్రీనివాసన్ వంటి సీనియర్లను కూడా ఐటీ టార్గెట్ చేయడం తమిళ నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఆర్కేనగర్ ఉపఎన్నిక రద్దు నైతికమా.. అనైతికమా అనే సంగతి పక్కనపెడితే.. ఐటీ నివేదిక ఆధారంగా నేతల అరెస్టులు కూడా జరిగే అవకాశం కనిపిస్తోంది. ఆరోగ్యమంత్రి విజయ్ భాస్కర్ కు ఐటీ నోటీసులు రావడంతో.. విషయం రూఢీ అయిపోయింది.

Leave a Reply