గోవును వదలని సంఘ్ పరివార్

0
578
sangh parivar concentrating on cows

Posted [relativedate]

sangh parivar concentrating on cowsఓవైపు మోడీ అభివృద్ధి మంత్రం పఠిస్తుంటే.. సంఘ్ పరివార్ మాత్రం ఆవును వదలడం లేదు. 2014 ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించినప్పట్నుంచీ.. ఏదో రకంగా దేశంలో గోవే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అవుతోంది. బీజేపీకి జనం కంటే గోవులే ముఖ్యమైపోయాయని విమర్శలు వస్తున్నా.. గోరక్షక దళాల ఆగడాలు ఆగడం లేదు. బీహార్ ఎన్నికల్లో గోరక్షణే కొంప ముంచిందని తెలిసినా.. సంఘ్ పరివార్ దూకుడు ముందు బీజేపీ నేతలు ఏమీ చేయలేకపోతున్నారు. మొన్నటికి మొన్న యూపీ ఎన్నికల్లో గెలిచాక ఆరెస్సెస్ మరింత రెచ్చిపోతోంది. మోడీ వద్దన్నా.. పట్టుబట్టి మరీ అతివాద హిందుత్వ నేతగా పేరున్న యోగి ఆదిత్యనాథ్ ను సీఎం చేసిన ఆరెస్సెస్.. దేశవ్యాప్తంగా గోవధపై నిషేధం విధించాలని గట్టిగా డిమాండ్ చేస్తోంది.

పేరుకు బీజేపీ అయినా.. పార్టీని నడిపించేది ఆరెస్సెస్ అనేది బహిరంగ రహస్యం. బీజేపీని మించిన క్షేత్రస్థాయి సిబ్బంది, నెట్ వర్క్ సంఘ్ పరివార్ సొంతం. చాలా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాల ఏర్పాటులో సంఘ్ దే కీలక పాత్ర. అందుకే ఆరెస్సెస్ మనోగతాన్ని అర్థం చేసుకున్న బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఒకరి తర్వాత ఒకరు యోగి బాటలో నడుస్తున్నారు. గోవధను నిషేధిస్తూ రాజస్థాన్, మధ్యప్రదేశ్ చట్టాలు చేశాయి. అవసరమైతే ఈశాన్యరాష్ట్రాల్లోనూ గోవధపై నిషేధం విధించే దిశగా ఆలోచనలు సాగుతున్నాయి.

గోరక్షణ విషయంలో ఆరెస్సెస్ ఆలోచనలకు అనుకోని మద్దతు లభిస్తోంది. అఖిల భారత షియా పర్సనల్ లా బోర్డు సహా.. ప్రఖ్యాత ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ ఇమాం కూడా ఈ వాదనను సమర్థించడంతో.. కొంతమంది ముస్లిముల్లో కూడా పునరాలోచన మొదలైంది. మత సామరస్యానికి.. ఇతరుల విశ్వాసాలను గౌరవించడం కూడా ముఖ్యమేనని కొందరు ముస్లిం పెద్దలు హితవు చెబుతున్నారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఈ నిర్ణయం అమలుచేస్తే పర్లేదు కానీ.. గోరక్షణ పేరుతో దాడులు చేయడం సరికాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా దాడులు వద్దని చెబుతున్నా.. ఆయన మనసులో మాట కూడా ఇదేనా అనే సందేహాలు మాత్రం వస్తూనే ఉన్నాయి.

Leave a Reply