కేసుల నుంచి విముక్తి పొందిన సంజయ్ దత్ వెండి తెరపై కనిపించడానికి ఎంతో కాలం పట్టదని అనుకున్నారంతా. కానీ సీన్ రివర్స్ అయింది. సంజయ్ స్క్రీన్ పైకి రావడం ఆలస్యమవడానికి ఓ రకంగా హృతిక్ రోషన్ కారణమని అంటున్నారు. ఎందుకంటే.. సంజయ్‌తో ‘బద్లా’ సినిమా తీస్తానని సిద్ధార్థ్ ఆనంద్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. ‘మున్నాభాయ్’ సమస్యల్లో చిక్కుకోవడంతో ఈ లోపు హృతిక్‌కు ‘ఫైటర్’ అనే స్టోరీ వినిపించాడు. ఈ కథ నచ్చడంతో ‘క్రిష్’ స్టార్ వెంటనే ఓకే చేసేశాడట. దీంతో సిద్ధార్థ్.. సంజయ్‌ను పక్కనపెట్టి హృతిక్ ప్రాజెక్ట్‌కు ప్రాధాన్యతనిచ్చాడు. ‘ఫైటర్’ షూటింగ్ నవంబర్ నుంచే ప్రారంభమవుతుందని సమాచారం.
బద్లా చిత్రీకరణ కూడా నవంబర్లోనే ప్రారంభం కావాలి. కానీ ఈ సినిమాకి హీరోయిన్ కుదరడం లేదని, స్టోరీ పూర్తిగా డెవలప్ కాలేదన్న కారణాలు వినిపిస్తున్నాడట సిద్ధార్థ్. అసలు కారణం మాత్రం.. ఆయన హృతిక్ సినిమా కంప్లీట్ చేయాలనుకుంటున్నాడనీ.. అందుకే సంజయ్ చిత్రాన్ని పోస్ట్‌పోన్ చేసుకున్నాడనీ చెప్పుకుంటున్నారు. బద్లా వాయిదా పడినంత మాత్రాన సంజయ్ డీలా పడడంలేదు. ఎందుకంటే.. విదు వినోద్ చోప్రా నిర్మిస్తున్న ‘మార్కో బావు’తో మున్నాభాయ్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తండ్రీ కూతుళ్ల అనుబంధంపై ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో సంజయ్‌కు కుమార్తెగా కృతి సనన్ నటిస్తోంది.