Posted [relativedate]
షూటింగ్ ముగించుకుని రాత్రిపూట ఇంటికి తిరిగివెళ్తున్న సమయంలో హీరోయిన్ భావన కార్ లోనే లైగింకవేధింపులకు గురైన సంగతి తెలిసిందే. మూడు రోజులక్రితం జరిగిన ఈ ఘటనతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కసారి ఉలిక్కి పడింది. తమ నటనతో ప్రేక్షకులను అలరించే సెలబ్రిటీస్ కి సమాజంలో రక్షణ కరువైందంటూ సినీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. నటీమణుల పట్ల అసభ్య పదజాలంతో అనుచిత ప్రవర్తన ప్రదర్శిస్తున్నారని, అటువంటి వారిని కఠినంగా శిక్షించాలని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపధ్యంలో నటుడు శరత్‌కుమార్ కుమార్తె, తమిళ నటి వరలక్ష్మి తనకు జరిగిన అవమానాన్ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు. భావనలా తాను కూడా లైంగిక వేధింపుల బారిన పడ్డానని తెలిపారు. అయితే కిడ్నాప్ కు గురి కాలేదని, ఇంటర్ వ్యూ నిమిత్తం ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కి వెళ్లగా ఈ చేదు అనుభవం ఎదురైందని వెల్లడించారు.
ఆ ఛానెల్‌కు చెందిన ప్రోగ్రామింగ్ హెడ్ తనతో నీచంగా మాట్లాడారని వాపోయారు. దాదాపు అర్ధగంట చర్చ అయ్యాక ‘మనం ఎప్పుడు బయటకలుద్దాం ..? అని ఆయన నాతో అన్నారు. ‘ఇంకేదైనా పని మీదా..?’ అని అడిగా. ఆయన నవ్వుతూ మరోలా చూస్తూ.. ‘లేదు.. పని కాదు. మిగిలిన పనుల కోసం’ అన్నాడు. నేను కోపాన్ని నిగ్రహించుకుంటూ ‘క్షమించండి.. అన్నాను. అంతేనా?’ అంటూ ఆయన నవ్వుతూ వెళ్లిపోయాడని వరలక్ష్మి వివరించారు. ఈ విషయాన్ని చెప్పాలా.. వద్దా.. అని రెండు రోజులు నుంచి మదనపడ్డానని, చివరికి ధైర్యంగా ఆలోచించి ఇలా షేర్ చేస్తున్నానని తెలిపారు.
ఇటువంటి ఘటనల గురించి విన్నప్పుడు చాలామంది ‘‘ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంతే అంటుంటారు. అలాంటి వాళ్లకు వరలక్ష్మి ఒక్కటే చెప్పారు. ‘‘ఎలాంటి భావోద్వేగాలు లేని ఓ మాంసపు ముక్కలా నన్ను ట్రీట్ చేస్తారనో లేదా ఇక్కడి మహిళలకు ఇలాంటివి కామన్.. సర్దుకుపోవాలనో తాను ఫిల్మ్ ఇండస్ట్రీకి రాలేదన్నారు. తనకు యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి ఈ ఫీల్డ్ లోకి వచ్చానన్నారు. తానొక హీరోయిన్ కాబట్టి స్క్రీన్ పై గ్లామరస్ గా కనిపిస్తానని, అంతమాత్రాన తనను అగౌరవపరిచే హక్కు ఎవ్వరికీ లేదన్నారు. మహిళలను ఆటబొమ్మగా చూసే మగాళ్లకు.. మహిళలను అగౌరవపరచడం మానుకోండి అంటూ… ఓ సూచన కూడా చేశారు. ఇంతకుముందు తానూ మౌనంగా భరించనని, ఇకనుండి బాధితులెవరైనా సరే మౌనంగా భరించకుండా ధైర్యంగా మాట్లాడాలని పిలుపునిచ్చారు. మగవాళ్లకు భయపడకుండా ధైర్యంగా బయటకొచ్చి మహిళలు మాట్లాడితేనే వాళ్లకు శిక్ష పడుతుందని సూచించారు.ఇప్పుడు మేలుకోకపోతే.. మహిళలకు భద్రత అనేది కలగానే మిగులుతుందని తెలిపారు.
భావన గురించి మాట్లాడుతూ… భావనకి మద్దతుగా నిలుస్తున్నానని, ఆమెను లైంగిక వేధింపులకు గురిచేసిన వ్యక్తులను శిక్షించాలని డిమాండ్ చేశారు.