Posted [relativedate]
పురుచ్చితలైవి జయలలిత మరణం తర్వాత అనుకున్నదానికంటే సులువుగా… అన్నాడీఎంకే పట్టు సాధించడంలో శశికళ సఫలయ్యారు. రాజకీయం అంటే అంత ఈజీగా అన్నంతగా ఆమెకు అన్నీ కలిసొచ్చాయి. పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అయినా.. ఆమె చెప్పినట్టే నడుచుకున్నారు. చివరకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆమె ఎన్నిక సాఫీగానే జరిగిపోయింది. చివరకు క్యాడర్ కూడా చిన్నమ్మ నామస్మరణలో మైమరిచిపోయారు. అమ్మ ఫోటోల స్థానంలో .. చిన్నమ్మ ఫోటోలు వచ్చాయి. దీంతో సీఎం కావడం చిటికెలో పని చిన్నమ్మ అనుకున్నారు. అందుకు తగట్టుగానే సెల్వం రాజీనామా చేశారు. ఇక సీఎం కుర్చీపై కూర్చోవడమే ఆలస్యం అనుకుంటున్న తరుణంగా అసలు ఆట మొదలైంది.
రెండు మూడు రోజుల్లో చిన్నమ్మను సమస్యలు ఒక్కొక్కటిగా చుట్టుముట్టాయి. శశికళపై అక్రమాస్తుల కేసు తీర్పు త్వరలోనే రానుంది. మరో నాలుగైదు రోజుల సమయం మాత్రమే ఉంది. సరిగ్గా ఇదే టైంలో సెల్వం రాజీనామాను ఆమోదించిన గవర్నర్…. శశికి మాత్రం అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. అటు కేంద్రం కూడా తమిళనాడు పరిణామాలను చాలా సీరియస్ గా పరిశీలిస్తోంది. దీంతో ఇక ప్రమాణ స్వీకారమే అనుకున్న తరుణంలో… అది వాయిదా పడింది. మొదట వాయిదానే అనుకున్న ఇప్పుడు అసలు ఉంటుందా.. ఉండదా అన్న అనుమానాలు వచ్చేస్తున్నాయి. అటు స్టాలిన్ ఢిల్లీకి వెళ్లి కంప్లయింట్ చేసే పనిలో ఉన్నారు. ఇటు సెల్వం కూడా వేగం పెంచారు. చిన్నమ్మ వైపున్న చాలామంది సెల్వం వైపు చూస్తున్నారట. పార్టీలోనూ ఒక్కొక్కరుగా శశికి వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. ఇక జయలలిత మేనకోడలు కూడా చిన్నమ్మపై మండిపడుతోంది.
చిన్నమ్మ పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. ఇప్పుడు తాను సీఎం అయ్యేందుకు ఆమె పావులు కదపక తప్పదు. ఇందుకోసం ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారామె. కానీ అది అంత ఈజీగా జరిగే అవకాశం లేదు. అలాగని వెనుకడుగు వేస్తే… పార్టీపై తన పట్టు సడలిపోతుంది. చివరకు అన్నాడీఎంలో ఆమె ఉనికే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి వస్తుంది. ఒకవేళ కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే… ఇక శశికళ రాజకీయంగా తెరమరుగయ్యే అవకాశం కూడా లేకపోలేదు.
నాలుగైదు రోజుల ముందు వరకు రాజభోగాలు అనుభవించిన శశికళ పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది. సమస్యలన్నీ ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సీఎం సీటు ఊరించి… ఉసూరుమనిపిస్తోంది. ఈ పరిస్థితిలో ఆమె ఏటికి ఎదురీదుతున్నారు. రాజకీయాల్లో ఎక్కడ నెగ్గాలో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో.. ఎక్కడ తగ్గాలో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం అని ఆమెకు ఇప్పుడు తెలిసొచ్చింది. కానీ ఇప్పుడామె తేరుకున్నా లాభం లేదు. ఆలస్యం జరిగిపోయింది. ఇదంతా చిన్నమ్మ స్వయంకృతాపరాధమోనని చెప్పక తప్పదంటున్నారు అన్నాడీఎంకే నాయకులు.