వీడియో పార్లర్ నుంచి సీఎం పీఠం వరకు!!!

Posted February 6, 2017

sashikala tamilnadu chiefminister
శశికళ నటరాజన్. ఈ పేరు వినగానే చాలా మందికి జయలలిత స్నేహితురాలిగా మాత్రమే గుర్తుపడతారు. కానీ చిన్న వీడియా పార్లర్ నుంచి సీఎం పీఠం వరకు ఎదిగిన ఆమె ప్రస్థానం వెనుక ఎన్నో ఆటు పోట్లున్నాయి. అనేక అవినీతి ఆరోపణలున్నాయి. పాజిటివ్ గా కంటే, నెగటివ్ గానే ఎక్కువగా ప్రజల నోళ్లలో నానిన శశికళ, అసలు జయకు ఎలా పరిచమయ్యారు. జయ ఆమెను ఎందుకంతగా నమ్మారు. పార్టీలో, ప్రభుత్వంలో ఎలాంటి పదవి చేపట్టకుండానే సీఎం సీటు వరకు వచ్చిన శశికళ బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

అన్నాడీఎంకే క్యాడర్ చేత చిన్నమ్మగా నీరాజనాలు అందుకుంటున్న శశికళ నటరాజన్ 1957లో తిరుత్తురైపుందిలో ఓ సాధారణ కుటుంబంలో జన్మించారు. ఆ తర్వాత వారి కుటుంబం మన్నార్ గుడికి వలస వెళ్లింది. ప్రాథమిక విద్యతోనే చదువు ఆపేసిన శశికళ, అక్కడ చిన్న వీడియో పార్లర్ నడిపేవారు. అక్కడే ప్రభుత్వ పీఆర్వోగా పని చేసే నటరాజన్ తో ఆమెకు పరిచమైంది. డీఎంకే అధినేత కరుణానిధి సమక్షంలోనే వీరి వివాహం జరిగింది. ఆ తర్వాత నటరాజన్ సాయంతో పార్టీ సమావేశాలు రికార్డు చేసే కాంట్రాక్టులు తీసుకునేవారు శశికళ. జయలలితకు మంచి స్నేహితురాలైన కడలూరు జిల్లా కలెక్టర్ చంద్రలేఖ ద్వారా ఆమెతో పరిచయం పెంచుకున్నారు శశికళ. ఆ తర్వాత వారిద్దరి స్నేహం పెరిగింది. జయకు సంబంధించిన అన్ని రాజకీయ సభల వీడియాలు తీస్తూ మరింత దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే మన్నార్ గుడి నుంచి పోయెస్ గార్డెన్ కు మకాం మార్చారు.

ఇక ఎంజీఆర్ మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, జయ సీఎం కావడం శశికళను మరింత కలిసొచ్చింది. జయలలితకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను శశికళ చూసుకునే వారు. అంతేకాదు ఆమె మేనల్లుడైన సుధాకరన్ ను జయకు దత్తతిచ్చారు. ఒక పక్క జయలలిత సీఎంగా తన ప్రాభవాన్ని పెంచుకుంటున్న సమయంలోనే శశికళ కూడా తన బలాన్ని పెంచుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడు రాకపోయినా.. తెరవెనుక ఉండి చక్రం తిప్పిన ఘనత చిన్నమ్మ సొంత. అప్పటి నుంచే జయను అమ్మగా పిలిచే జనాలు, శశికళను చిన్నమ్మగా పిలిచేవారు.

శశికళ నటరాజన్ పేరు ఎక్కువగా వివాదాలతోనే ప్రజల నోళ్లలో నానే వారు. జయలలిత వ్యక్తిగత వ్యవహారాలు చూసుకునే క్రమంలో, భారీగా అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలొచ్చాయి. ఇక ఆమె భర్త నటరాజన్ పై, ప్రభుత్వ పనుల్లో జోక్యం చేసుకుంటూ, ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. జయపై నమోదైన అక్రమాస్తుల కేసులోనూ శశికళ, ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కలర్ టీవీ స్కాంలో జయతో పాటూ ఆమె 30 రోజుల పాటూ జైలు శిక్షను కూడా అనుభవించారు. అటు రెండు సార్లు శశికళ కుటుంబాన్ని పోయెస్ గార్డెన్ నుంచి బహిష్కరించారు. 2011లో శశికళతో పాటూ ఆమె భర్త నటరాజన్ ను, దత్తపుత్రుడు సుధాకరన్ ను, మరో 10 మందిని పార్టీ నుంచి బహిష్కరించారు. తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారన్న ఆరోపణలపై జయ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కొంతకాలం జయ శశికళను దూరం పెట్టినప్పటికీ, ఆ తర్వాత మళ్లీ ఆమెను అక్కున చేర్చుకున్నారు.

సెప్టెంబర్ లో జయ ఆస్పత్రి పాలైనప్పటి నుంచి, పార్టీ కార్యక్రమాలను అనధికారికంగా శశికళే చూసుకున్నారని అంతా చెప్పుకుంటారు. అంతేకాదు ఆమె చికిత్స సమయంలో జయ దగ్గర ఉన్న ఒకే వ్యక్తి శశికళ. జయ మరణించిన తర్వాత ఆమె అంత్యక్రియలు నిర్వహించింది కూడా చిన్నమ్మే. ఆ తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించడం, మరికొద్ది రోజులకు శాసన సభ పక్ష నేతగా ఎన్నికవడం అంతా నాటకీయంగా జరిగిపోయింది. అంతేకాదు జయ మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా శశికళ సిద్ధమవుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

SHARE