Posted [relativedate]
కేంద్రంలో 2004 నుంచి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పేరుకు మాత్రమే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉండేవారు. కీలక నిర్ణయాలన్నీ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీనే తీసుకునే వారని టాక్. మన్మోహన్ ప్రధాని అయినా.. ఆయనను కలిసే వారి కంటే సోనియాను కలిసే వారి సంఖ్యే ఎక్కువగా ఉండేది. కేంద్రమంత్రులు కూడా పనుల కోసం సోనియా గాంధీ దగ్గరికే ఎక్కువగా వెళ్లేవారు. అంటే ప్రధాని వెనక అసలైన రాజకీయ శక్తి అప్పట్లో సోనియాగాంధీయే అని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు తమిళనాడులోనూ అలాంటి సీన్ కనిపించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.
జయలలిత మహాభినిష్క్రమణం తర్వాత పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. స్వతహాగా కొంచెం మృధుస్వభావి అయిన ఆయనకు ఎమ్మెల్యేల పైన గానీ, పార్టీ పైన గానీ పెద్దగా పట్టు లేదు. గతంలో ముఖ్యమంత్రిగా చేసిన అనుభవమున్నా… అప్పట్లో జయ చెప్పినట్టే ఆయన నడుచుకునే వారు. ఇప్పుడు ఆమె లేకపోయినప్పటికీ… పన్నీర్ సెల్వం సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే పన్నీర్ సెల్వం కంటే శశికళకే ఎమ్మెల్యేలతో పాటు పార్టీ పైనా పట్టుంది. అవసరమైనప్పుడు గట్టిగా మాట్లాడే నేర్పు కూడా ఉంది. అంటే ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కంటే ఎక్కువ పవర్ శశికళకే ఉందన్న మాట.
మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలో సోనియాకు… ఇప్పుడు పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరుణంలో శశికళకు మధ్య చాలా పోలికలున్నాయి. పన్నీర్ సెల్వం పేరుకే ముఖ్యమంత్రి అని… కథ నడిపించేది అంతా శశికళేనని టాక్. అంటే శశికళను తమిళనాడు సోనియాగా చెప్పవచ్చంటున్నారు రాజకీయ పరిశీలకులు.