దండలో దారం …తమిళనాట చిన్నమ్మ

0
323
sasikala place gone in aiadmk party because of panneerselvam

Posted [relativedate]

sasikala place gone in aiadmk party because of panneerselvam
పూల దండలో దారం చాలా ముఖ్యమైనది.తలన పెట్టుకునేది పూలే అయినా వాటితో పాటు దారం కూడా నెత్తిన చేరుతుంది.అక్కడికి చేరాం కాబట్టి అది తన గొప్పదనము అనుకుని పూలని పక్కనపడేసి తననే తలకు చుట్టుకోమని దారం కోరుకుంటే ఏమవుతుంది? సీన్ మారిపోతుంది. పూలు లేని దారాన్ని ఎవరైనా తలకు చుట్టుకుంటారా ? ఒకవేళ ఎవరైనా తలకు చుట్టుకున్నా వాళ్ళని పిచ్చి వాళ్ళుగా చూస్తుంది లోకం.ఇప్పుడు తమిళనాట జరిగింది అదే .జయ బతికివున్నప్పుడు దండలో దారం లా వున్న శశికళ,సువాసనలు వెదజల్లే పూవు రాలిన తర్వాత కూడా తలనే అంటిపెట్టుకు కూర్చోడానికి ప్రయత్నించి నెలకి గిరవాటు వేయించుకుంది.

జయ మరణం తర్వాత చిన్నమ్మ చాలా వేషాలే వేసింది.జయలా సీరియస్ గా కనిపించడం,దండాలు పెట్టడం,ఆమెలా చీరకట్టు,పార్టీ లో ఆమెలా ఏకఛత్రాధిపత్యం….అబ్బో చెప్పుకుంటూ పోతే చాలా వున్నాయి.ఇక జయ సమాధి దగ్గర హడావిడి,శపధాలు శశి నాటకాలకు పరాకాష్ట.ఇక రాజకీయాల్లో జయ నమ్మిన బంటు గా వున్న పన్నీర్ సెల్వం ని దెబ్బకొట్టేందుకు ప్రయత్నించి ఆమె దారుణంగా కుదేలైన విషయం చూస్తుంటే పురాణాల్లో పౌండ్రకుడు గుర్తుకు వస్తున్నాడు.

పుండ్ర రాజ్యానికి రాజు ఈ పౌండ్రకుడు.కృష్ణుడి చిరకాల శత్రువు జరాసంధుడుకి దగ్గరవాడు. జరాసంధుండుని పదేపదే కృష్ణుడు దెబ్బ తీయడం,అతడిని ఈలోకం వాసుదేవుడిగా కీర్తించడం నచ్చని పౌండ్రకుడు ఎవరూ చేయని పనికి పూనుకున్నాడు.తాను కూడా కృష్ణుడి వేషధారణ వేసుకుని తానే అసలైన వాసుదేవుడునని జనానికి చెప్పుకు తిరిగేవాడు.ఆయన వెనుక అంతా నవ్వుకునేవారు. ఎదుటపడినప్పుడు రాజు కనుక గౌరవించినట్టు నటించేవాళ్ళు.ఇది అర్ధం చేసుకోలేక పాండ్రకుడు కొన్నాళ్ళకి తనని తాను నిజమైన వాసుదేవుడనే నమ్మడం మొదలెట్టాడు.తన అస్తిత్వాన్ని మరిచిపోయి తాను వేసుకున్న వేషాన్ని నిజమని నమ్మే స్థితికి వచ్చాడు .ఆ దశలోనే కృష్ణుడితో యుద్ధానికి తలపడి ప్రాణాలు కోల్పోయాడు పౌండ్రకుడు.ఇప్పుడు శశికళ కూడా రాజకీయంగా పన్నీర్ చేతిలో అలాగే చావుదెబ్బ తింది.

Leave a Reply