చిన్నమ్మకి పవర్ పాలిటిక్స్ రుచి తగిలింది..

Posted February 9, 2017

sasikala shocked after watching o panneerselvam rulingఇన్నాళ్లు జయ చాటున ఉండి పవర్ ఎంజాయ్ చేసిన చిన్నమ్మకి పవర్ పాలిటిక్స్ లో చేదు రుచి ఎలా ఉంటుందో చూపిస్తున్నారు సీఎం పన్నీర్ సెల్వం.శశికళ ఏమి చేస్తారో ముందే ఊహించి ఓ ముఖ్యమంత్రిగా దాన్ని అడ్డుకోడానికి ఏమి చేయాలో అంతా చేసేస్తున్నారు.ఎమ్మెల్యేలతో శశికళ వర్గం నడిపిస్తున్న క్యాంపు ని చెదరగొట్టేందుకు పోలీస్ ఫోర్స్ ఉపయోగిస్తున్నారు.ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో కనుక్కుని వారిని బయటకు తీసుకురావాలని డీజీపీకి ఆదేశాలు ఇచ్చారు.అటు శశికళకి అనుకూలంగా వ్యవహరిస్తున్న చెన్నై పోలీస్ కమీషనర్ ని ఒక్క వేటుతో ఇంటికి పంపారు.పరిస్థితి లో సీరియస్ నెస్ అర్ధమైన ఖాకీలు ఎమ్మెల్యేల వేటలో పడ్డారు.ఇక అన్నాడీఎంకే కి సంబంధించిన నిధుల వ్యవహారంలోనూ పన్నీర్ జాగ్రత్తపడ్డారు.పార్టీ అకౌంట్స్ తాత్కాలికంగా నిలుపుదల చేయాలని బ్యాంకులకు లేఖ రాశారు.ఈ రెంటితోపాటు జయ మృతిపై న్యాయవిచారణకు ఆదేశించారు.

ఇలా ముఖ్యమంత్రి హోదాలో శశికళకి చుక్కలు చూయిస్తున్నారు పన్నీర్ సెల్వం.దీంతో ఇప్పటిదాకా పన్నీర్ సమర్ధత మీద నమ్మకం కలగక దూరంగా వుండిపోయిన చాలా మంది నేతలు ఆయనకి మద్దతుగా గొంతు విప్పుతున్నారు.సీనియర్ నాయకుడు మధుసూదన్ సైతం పన్నీర్ కి అండగా ఉంటానని ప్రకటించారు.పన్నీర్ పవర్ పాలిటిక్స్ దెబ్బకి శశి క్యాంపు లో వున్న మరికొందరు ఎమ్మెల్యేలు సైతం ఆయన వైపే మొగ్గుతున్నారు.దీంతో ఏమీ పాలుపోని శశికళ తమ ఎమ్మెల్యేల్ని పన్నీర్ కొంటున్నారని ఆరోపించారు.

ఇక తమిళనాడు రాజకీయాలపై కీలక నిర్ణయం తీసుకోవాల్సిన గవర్నర్ విద్యాసాగరరావు కూడా చెన్నై చేరుకున్నారు.సీఎం రేసులో పోటీపడుతున్న పన్నీర్,శశికళకి ఈ సాయంత్రం గవర్నర్ అపాయింట్ మెంట్ దొరికింది.5 గంటలకి పన్నీర్ సెల్వం,7 గంటలకి శశికళ గవర్నర్ తో భేటీ కాబోతున్నారు

SHARE