భూమిని పోలిన మరో గ్రహం కోసం శాస్త్రవేత్తలు అన్వేషణ వేగవంతమైంది. ఇప్పటి వరకు కనుగొన్న 4000 కొత్త గ్రహాలలో సుమారు 20 గ్రహాలలో నీరు ఉండవచ్చునని భావిస్తున్నామన్నారు కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన సైంటిస్ట్ ఫిలిప్ లూబిన్. ఈ అనంతమైన విశ్వంలో సూర్యకుటుంబం లాంటివి 100 బిలియన్ వరకు ఉన్నాయని ఆయన తెలిపారు.
మనకు అతిదగ్గరగా కనిపించే ఆల్ఫా సెంచురీ నక్షత్ర మండలంలో భూమిని పోలిన గ్రహాలు ఉన్నట్టు ఆయన వెల్లడించారు.ఈ నక్షత్ర మండలంలోనే ప్రాక్జిమా సెంచురీ అనే నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న ఒక గ్రహంపై సముద్రపు జాడలు కనుగొన్నట్టు ఫిలిప్ వెల్లడించారు. దీని నుంచి మన భూమికి సుమారు 4.2 కాంతి సంవత్సరాల కాలం పడుతుందన్నారు.
ఈ విషయాన్ని జర్మనీ వార పత్రిక డెర్ స్పైజెల్ వెలువరించింది. యూరోపియన్ స్పేస్ అబ్జర్వేటరీ అధికారికంగా ఈ విషయాన్ని ఈ నెలాఖరులోగా వెలువరిస్తుందన్నారాయన. ఏలియన్స్ పై అనేక దేశాలు పరిశోధనలు జరుపుతున్న సంగతి తెలిసిందే. భూమిని పోలిన గ్రహాల అన్వేషణ త్వరలో ఫలిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్త పరిచారు ఫిలిప్.