ఆ అద్దం చూడు …జీవితం నువ్వు చెప్పినట్టే వింటుంది

Posted January 11, 2017

see the mirror in your eyes then your life going as you like
ఎప్పటిలాగానే ఆ రోజు కూడా ఉద్యోగులంతా ఆఫీస్ కి వచ్చారు.రావడంతోనే ముఖద్వారం దగ్గర నోటీస్ బోర్డు లో పెద్ద పెద్ద అక్షరాల మీద అందరి దృష్టి పడింది.దాని సారాంశం ఏమిటంటే.. ఈ కంపెనీలో మీ ఎదుగుదలకి అడ్డుగా నిలుస్తున్న ఓ వ్యక్తి చనిపోయారు.అయన శవయాత్రకి మీరంతా హాజరుకావాలని విన్నపం.

అది చదవగానే తమలో ఓ ఉద్యోగి చనిపోయాడని కొందరు బాధపడ్డారు.మరికొందరు ఇన్నాళ్లు ఇతని వల్లే మాకు నష్టం జరిగిందా అని తమలో తామే మాట్లాడుకున్నారు.సరే ఇంతకీ అయన ఎవరో చూసి వద్దాం అని ఒక్కొక్కరిగా అందరూ బయట ఉంచిన శవపేటిక దగ్గరకి చేరుకుంటున్నారు.కానీ అసలు చనిపోయింది ఎవరో ఎవరికీ అర్ధం కాలేదు.దీంతో కుతూహలం ఆపుకోలేని కొందరు ముందుకెళ్లారు.ఒక్కొక్కకరిగా శవపేటిక తెరిచి లోపలి చూశారు..వారికి షాక్ ..లోపలి చూడగానే వారి నోట మాట రాకుండా అయిపోయారు.అలా స్థాణువులా నిలుచుండిపోయిన వారి కళ్ళే భావాలు పలికిస్తున్నాయి.ఇంతకీ శవపేటిక లోపలికి చూసిన వాళ్లంతా అలా ఎందుకయ్యారో తెలుసా?

పేటిక లోపల ఎలాంటి శవం లేదు.కేవలం ఓ పెద్ద అద్దం వుంది.అందులో ఎవరు చూస్తే వాళ్ళ మొహం ప్రతిబింబిస్తోంది.ఆ పక్కనే ఇలా రాసి వుంది ‘ ఈ ప్రపంచంలో మీ ఎదుగుదలకి సంబంధించిన లక్ష్యాలు నిర్దేశించుకునే శక్తిసామర్ధ్యాలు మీ ఒక్కరికే వున్నాయి.మీ సంతోషం,విజయం , తెలుసుకొనే సామర్ధ్యం …వీటన్నిటినీ ప్రభావితం చేసేది మీ ఒక్కరే. బాస్,ఆఫీస్,ఫ్రెండ్స్…ఇవేమి మారినా మీ జీవితం మారదు.మీరు మారినప్పుడు మాత్రమే మీ జీవితం మారుతుంది.నా శక్తిసామర్ధ్యాలు ఇంతే అన్న ఆలోచన ని అధిగమించి చూడండి..మీ జీవితం ఇలా ఉండటానికి మీదే బాధ్యత అని అర్ధమవుతుంది.ఈ నగ్న సత్యాన్ని మీరు అర్ధం చేసుకుంటే …దానికి అనుగుణంగా మార్పు చేసుకుంటే ..మీ జీవితం మారిపోతుంది ‘

ఆ సందేశం చదివాక ప్రతి ఒక్కరు అర్ధం చేసుకోవలసిన విషయం ఒకటుంది. ఓ గుడ్డు ని బయట నుంచి గట్టిగా కొడితే అది పగిలిపోతుంది..అంటే ఓ జీవితం ముగిసిపోయింది.కానీ అదే శక్తి లోపలి నుంచి ఉద్భవిస్తే గుడ్డు పగిలి పిల్ల బయటికి వస్తుంది. ఓ జీవితానికి అంకురార్పణ జరిగింది.ఔను మార్పు రావాలంటే …జీవితం మారిపోవాలంటే మీలో నుంచి మీరు మళ్లీ పుట్టాలి ..సరికొత్తగా మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోవాలి .
* గొప్ప గొప్ప విషయాలెప్పుడూ అంతర శక్తుల నుంచే పుడతాయి.

ఇదంతా చదివాక మీరే చెప్పండి ..ఆ అద్దం చూస్తే …మీలో నుంచి మీరు సరికొత్తగా పుడితే …మీ జీవితం మీరు చెప్పినట్టు వినదా?

SHARE