Posted [relativedate]
గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో శరణమా… రణమా అనే డైలాగ్ ఉంటుంది. అది పన్నీర్ సెల్వం కు సరిగ్గా సూటవుతుంది. ఇన్నాళ్లూ శశికళ ముందు శరణం అన్న ఆయన… ఇక సమరభేరి మోగించారు. రణమే అంటూ చిన్నమ్మపై యుద్ధం ప్రకటించేశారు. తొలిసారిగా ఆయనలోని మరో కోణం బయటపడింది. తిరుగుబాటు చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. నేనేంటో చూపిస్తానంటూ ప్రతిన బూనారు. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు.
సీఎం సీటు కోసం .. శశికళకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలను ఏకం చేసి పనిలో ఉన్నారు పన్నీర్ సెల్వం. నిన్నటిదాకా సెల్వంకు పెద్దగా ఎమ్మెల్యేల మద్దతు ఉండదన్న అంచనాలు తలకిందులను చేస్తూ.. ఆయన దూసుకుపోతున్నారు. సెల్వం సారు క్యాంపులో ఎమ్మెల్యేల సంఖ్య దాదాపు 70 కి చేరిందని సమాచారం. మరికొంతమంది కూడా చిన్నమ్మ క్యాంపు నుంచి సెల్వం వైపు చూస్తున్నారట. ఇన్నాళ్లకు తనకు టైమ్ వచ్చింది కాబట్టి దాన్ని వృథా చేయడం ఆయనకు ఇష్టం లేదు. అందుకే ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి, కేంద్రపెద్దలను కలవాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రిగా తనకు ఎంతమంది మద్దతు ఉంది… తనపై జరుగుతున్న కుట్రలను వివరించబోతున్నారట.
పన్నీర్ సెల్వం ఢీకొడుతున్నది మామూలు వ్యక్తిని కాదు. శశికళను.. కాబట్టి బల నిరూపణ సెల్వం కు కీలకంగా మారింది. 235 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో అన్నాడీఎంకేకు 135 మంది ఎమ్మెల్యేలున్నారు. డీఎంకే నుంచి 89 మంది, కాంగ్రెస్ కు 8, ముస్లింలీగ్ కు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. పన్నీరు సెల్వమ ముఖ్యమంత్రి కావాలంటే 117 మంది ఎమ్మెల్యే మద్దతు అవసరం. ప్రస్తుతం సెల్వం దగ్గర అటు ఇటుగా… 70 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అంచనా. అంటే మ్యాజిక్ ఫిగర్ కు దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు ఇంకా కావాలి. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో వారు జంప్ కొట్టే అవకాశమున్నా.. ఒకేసారి అంతమంది సెల్వం క్యాంపులోకి వచ్చే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో డీఎంకే మద్దతు లేనిదే ఆయన అడుగు ముందుకు వేసే అవకాశం లేదు.
శత్రువుకు శత్రువు మిత్రుడు కాబట్టి ప్రస్తుతం డీఎంకేకు ప్రధాన శత్రువుగా మారిన శశకళకు చెక్ పెట్టేందుకు స్టాలిన్ దేనికైనా రెడీ అంటున్నారు. అవసరమైతే సెల్వం ప్రభుత్వానికి మద్దతిచ్చేందుకు కూడా ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆ దిశగా సెల్వంతో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. ఉంటే సెల్వం సీఎంగా ఉండాలి గానీ… శశికళను ప్రజలు స్వీకరించరు… అంటూ స్టాలిన్ గతంలో చెప్పిన మాటలు సెల్వంకు అనుకూలంగా మారాయి. కాబట్టి స్టాలిన్ సపోర్ట్ చేస్తారని ఆయన కొండంత ఆశ పెట్టుకున్నారు.
స్టాలిన్ మద్దతు పలికితే.. ఒకే లేకపోతే ఢిల్లీ అండతో ముఖ్యమంత్రి అయ్యేందుకు కూడా మరో ప్లాన్ చేస్తున్నారట సెల్వం. చిన్నమ్మ వర్గంలోని ఎమ్మెల్యేలను నయానో భయానో… లాగేందుకు ఢిల్లీ నుంచే ఫోన్లు చేయిస్తారట. బీజేపీకి చెందిన జాతీయ నాయకులు కూడా సెల్వంకు మద్దతుగా రంగంలోకి దిగే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. వెంకయ్య నాయుడు కూడా ఇప్పటికే సెల్వంతో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇక చిన్నమ్మకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేకుండా అన్ని వైపుల నుంచి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయట. సెల్వం సారుకు ఇప్పుడు నమ్మకం వచ్చేసిందట. తాను సీఎం కావడం ఖాయమని ఆయన గట్టిగా చెబుతున్నారట.
మొత్తానికి సెల్వం వీక్ సీఎం అని అందరూ అనుకున్నారు. ఆ అంచనాలు తలకిందులయ్యాయి. రాజకీయాల్లో ఓపిక ఎంత ముఖ్యమో ఇప్పుడు తెలిసొచ్చింది. తనకంటూ సమయం వచ్చే వరకు ఆయన వేచి ఉన్నారు. శశికళ హవా నడిచినంత వరకు ఆమె చెప్పినట్టే విన్నారు. ఒక్కసారిగా ఆమెకు బ్యాడ్ టైం వచ్చేసరికి… దాన్ని అందిపుచ్చుకున్నారు. ఇప్పుడు చిన్నమ్మను ఒక ఆట ఆడుకుంటున్నారు. రాజకీయం అంటేనే అది. ఎంతైనా సెల్వం స్ట్రాటజీయే కరెక్ట్ అని ఇప్పుడు అందరూ అంగీకరించాల్సిందే..!!