Posted [relativedate]
అన్నాడీఎంకే లో చీలిక అనివార్యంగా కనిపిస్తున్న పరిస్థితుల్లో శశికళకి ఆమెని నమ్ముకున్న అనుచరగణం తప్ప మరో అస్త్రం లేకుండా పోయింది.ఇన్నాళ్లు తనను చూస్తే భయపడిపోయే అన్నాడీఎంకే నేతలు ఎదురు దాడి చేస్తారని శశి కలలో కూడా ఊహించలేదు.ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న పన్నీర్ సెల్వం ఇంతలా వణికిపోతుంటే ఇక మిగతావాళ్ళు ఏ మాత్రం తన జోలికి వచ్చే సాహసం చేయరని భావించింది శశికళ.పార్టీ పగ్గాలు కూడా తేలిగ్గానే అందేసరికి ఆమె ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది.ఓ విధంగా విజయానందంలో ఆదమరిచి వుంది.అక్కడే శశి పప్పులో కాలేసింది. ఇన్నాళ్లు అన్నాడీఎంకే శ్రేణులు జయని చూసి తనని గౌరవిస్తున్నారని,తనకు భయపడుతున్నారని ఆమె ఓ చిన్న విషయాన్ని గ్రహించలేక పోయింది.ఇక ఆడమన్నట్టు ఆడుతున్నాడు కదాని పన్నీర్ సెల్వాన్ని చిన్న చూపు చూడడం శశి చేసిన ఇంకో పెద్ద తప్పు.వాలు గాలిలో కాదు ఎదురుగాలిలో రాజకీయం చేయడం ఎంత కష్టమో శశికి ఈ పాటికే అర్ధం అయిపోయుంటుంది. అంతే కాదు జయలా రాజకీయం చేయడం తనకి సాధ్యం కాదని కూడా శశి గుర్తెరగాలి.జయ ఇంట్లో ఉన్నంత మాత్రాన,ఆమె కుర్చీలో కూర్చున్నంత మాత్రాన ఆమె రాజకీయ శక్తి,ఆదరాభిమానాలు తనకు రావని శశి ఒక్క దెబ్బతో నిరూపించాడు పన్నీర్ సెల్వం.
పన్నీర్ సెల్వం ఇచ్చిన షాక్ తో ఆలస్యంగా తేరుకున్న శశికళకి ప్రయోగిద్దామంటే ఒక్క ఆయుధం కూడా దగ్గర లేకుండా పోయింది.తాను ఏదో ఒకటి చేయాలి కాబట్టి పన్నీర్ ని పార్టీ కోశాధికారి బాధ్యతల నుంచి తప్పించి వేరేవారికి ఆ పోస్ట్ ఇచ్చారు.ఒకవైపు పన్నీర్ తొడకొడుతుంటే ఇటువైపు నుంచి అది కాలు గిల్లినట్టుంది.సెల్వం ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే అసలుకే మోసం వస్తుందన్న భయం ఇంకో వైపుంది.అందుకే ఏమి చేయాలో పాలుపోని పరిస్థితుల్లో హఠాత్తుగా ఆమెకో ఆయుధం దొరికింది.అదే స్టాలిన్ బాణం.అన్నాడీఎంకేలో చీలిక వస్తే పన్నీర్ కి మద్దతిచ్చేందుకు డీఎంకె సన్నద్ధంగా ఉందన్న వార్తల నేపథ్యంలో మొత్తం పాపాన్ని స్టాలిన్ ని బాణాన్ని సెల్వం మీద ప్రయోగిస్తోంది శశికళ.పార్టీ అభిమానులు సెల్వం వైపు మొగ్గకుండా డీఎంకె అండతోనే ఈ కుట్ర జరుగుతోందని చెప్పేందుకు చిన్నమ్మ వర్గం ప్రయత్నిస్తోంది.అయితే తాను ఏ పార్టీలో చేరబోనని పన్నీర్ ప్రకటించారు.అమ్మ ,అన్నాడీఎంకే కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని పన్నీర్ చెబుతున్నారు .వినయవిధేయతల విషయంలో ఆయన్ని తప్పుబట్టలేమని అందరికీ తెలుసు .అందుకే స్టాలిన్ బాణం ఏ మేరకి పని చేస్తుందో డౌట్ .అది పని చేయలేదో పన్నీర్ దెబ్బకి శశి అవుట్ అయిపోయినట్టే .