కోరి కొని తెచ్చుకున్న ఓటమి!!

0
564
sharmila wantedly lost in elections

Posted [relativedate]

sharmila wantedly lost in elections
మణిపూర్ ఐరన్ లేడీ ఇరోం షర్మిల కోరి ఓటమిని కొని తెచ్చుకున్నారా? నియోజకవర్గం ఎంపికలో ఆమె అట్టర్ ఫ్లాపయ్యారా? మరో నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఉంటే పరిస్థితి వేరే రకంగా ఉండేదా? అంటే ఔననే అంటున్నారు మణిపూర్ వాసులు.

ఇరోం షర్మిల కొత్త పార్టీ పెట్టినప్పుడు ఆమెకు మంచి హైప్ వచ్చింది. కొత్త పార్టీ మణిపూర్ ను కుమ్మేయడం ఖాయమన్న అంచనాలు వెలువడ్డాయి. అందుకు తగ్గట్టుగానే పార్టీ పెట్టిన కొత్తలో మంచి స్పందన వచ్చింది. కానీ రాజకీయ అనుభవం లేకపోవడం ఆమెకు మైనస్ అయ్యింది. అరవింద్ కేజ్రీవాల్ లా ప్రణాళిక ప్రకారం వెళ్లి ఉంటే పరిస్థితి వేరేరకంగా ఉండేది. ముఖ్యంగా షర్మిలకు సరైన రాజకీయ సలహాదారులు లేకపోవడం మైనస్ అయ్యింది. లేకపోతే తన స్వస్థలంలో మంచి ప్రజాదరణ ఉన్నా… పట్టుదలకు పోయి ముఖ్యమంత్రి ఇబోబిసింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం ఎంచుకోవడం ఏంటి? ఇది కచ్చితంగా ఆమె స్వయంకృతపరాధమే!!

ఇరోం షర్మిల ముందు థౌబాల్ తో పాటు తన స్వస్థలం ఖురాయ్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ ఎందుకనో ఆ ఆలోచన విరమించుకున్నారు. థౌబాల్ కే పరిమితమయ్యారు. తనను తాను ఎక్కువ ఊహించుకున్నారో.. ఏమో ఏకంగా ఇబోబిసింగ్ తో తలపడేందుకు సిద్ధమయ్యారు. ఇదే ఆమె ఓటమికి ముఖ్య కారణమైంది. ఇక జనం కూడా రాజకీయ అనుభవం లేని షర్మిల ఎందుకు అనుకున్నారో ఏమో.. ఆమెను ఘోరంగా తిరస్కరించారు. ఇబోబిసింగ్ కు భారీ మెజార్టీని కట్టబెట్టారు. అదే ఆమె స్వస్థలం నుంచి పోటీ చేస్తే విజయం సాధించడం పెద్ద కష్టం కాకపోయేది.

మణిపూర్ లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం రద్దు కోసం 16 ఏళ్లు దీక్ష చేసిన ఆమె.. కొంతకాలం కింద దీక్షను విరమించారు. దీక్షను ఎందుకు విరమించారో.. ప్రజలకు సరైన సమాధానం చెప్పలేకపోయారు. ఇక జనం కూడా సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం ఉంటే.. ఏంటి? లేకపోతే ఏంటి? అనే భావనకు వచ్చారు. ఎందుకంటే గతంలో లాగా ఇప్పుడు సైనికులు జనంపై ప్రతాపం చూపే రోజులు లేవు. ఇప్పుడు మీడియా వచ్చేసింది. సోషల్ మీడియా ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో ఇరోం షర్మిల ఉద్యమం జనానికి పాత చింతకాయ పచ్చడిలా కనిపించింది.

దీనికి తోడు తాను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానో… గెలిస్తే ప్రజలకు ఏం చేయదలుచుకున్నారో చెప్పడం ఇరోం షర్మిల ఘోరంగా విఫలమయ్యారు. అందుకే జనంలో మంచి గుర్తింపు ఉన్నా.. ఓట్లను రాబట్టుకోలేకపోయారు. మొత్తానికి ఇది ఇరోం షర్మిల స్వయంకృతాపరాధమే!! లేకపోతే 16 ఏళ్లు అవిశ్రాంత పోరాటం చేసిన ఉక్కుమహిళ దారుణంగా ఓడిపోవడం మాటలు కాదు!!

Leave a Reply