శర్వా ఇక సంక్రాంతి హీరో..

  sharwanand pongal hero

శర్వానంద్ ఎక్కడా తగ్గడం లేదు.మొన్న సంక్రాంతికి కలిసొచ్చిందని ఈసంక్రాంతికి కూడా అలాగే ట్రై చేస్తున్నాడు.కొడితే పెద్ద హీరోలనే కొట్టాలని పని గట్టుకుని మరీ ఈసారి కూడా అడుగులు వేస్తున్నాడు.యంగ్ హీరో శ‌ర్వానంద్‌కు కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎక్స్‌ప్రెస్ రాజా సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో మ‌రోసారి పెద్ద హీరోలను ఢీకొట్టడానికి రెడీ అయిపోయాడు. దానిలో భాగంగానే ‘శతమానం భవతి’‌ ని కూడా వచ్చే ఏడాది సంక్రాంతికే రిలీజ్‌ చేస్తారట. నిర్మాత దిల్‌ రాజు స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించాడు. ‘బొమ్మరిల్లు’ విడుదలై పదేళ్లు పూర్తయిన సంద‌ర్భంగా ‘శతమానం భవతి’ విశేషాలు పంచుకున్నాడు రాజు.

ఈ ఏడాది సంక్రాంతికి ఏకంగా నాలుగు సినిమాలు పోటీ పడ్డాయి. అందులో మూడు స్టార్‌ హీరోల సినిమాలు. వాటికి పోటీగా శర్వానంద్‌ సినిమా ఎక్స్‌ప్రెస్‌ రాజా’ను బరిలోకి దించి స‌క్సెస్ అయిన సంగ‌తి తెలిసిందే.ముగ్గురు పెద్ద హీరోల సినిమాల మ‌ధ్య ఎక్స్‌ప్రెస్ రాజా వంటి చిన్న సినిమా నలిగిపోతుందేమో అని అంద‌రూ జాలిపడ్డారు. కానీ కంటెంట్‌ ఉన్న సినిమాకు ఎంత పోటీ ఉన్నా పర్వాలేదని ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’ నిరూపించింది. పెట్టుబడి మీద మంచి లాభాలు తెచ్చి పెట్టి సూపర్‌ హిట్‌ అనిపించుకుంది. విజ‌య‌ఢంకా మోగించింది.

తమ బేనర్లో బొమ్మరిల్లు తరహాలో మరో మైలురాయి లాంటి సినిమా ‘శతమానం భవతి’ అని.. ఇందులో శర్వానంద్‌ మనవడిగా.. ప్రకాష్‌ రాజ్‌ తాతగా నటిస్తారని దిల్ రాజు వెల్లడించాడు. ఇంతకుముందు రామదండు, దొంగలబండి లాంటి సినిమాల్ని రూపొందించిన సతీశ్‌ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. వ‌చ్చే ఏడాది మ‌రెన్ని సినిమాల‌తో శ‌ర్వా పోటీనిస్తాడో చూడాలి.

SHARE