వెంకయ్య ఉగాది చేసుకున్నా తప్పేనా?

Posted March 28, 2017

social media giving wrong publicity on venkaiah naidu
ఏపీ లో ఒక పార్టీ అనుకూల సోషల్ మీడియా పరిధి దాటుతోంది.తమ నేతకు,ఆయన పార్టీ కి మేలు చేయడం కోసం ఎవరి మీద రాయి విసరడానికైనా,ఎవరిపై బురద చల్లడానికైనా రెడీ అయిపోయింది.టీడీపీ,బీజేపీ మధ్య బంధాన్ని తెగ్గొట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అడ్డం పడుతున్నాడని సదరు పార్టీ నేత గ్రహించాడు.దీంతో వెంకయ్యని ఎక్కడ వీలైతే అక్కడ భ్రష్టు పట్టించాలని ఆ నాయకుడు చేసిన ఆదేశాలతో ఆ పార్టీ సోషల్ మీడియాని నడిపిస్తున్న వాళ్ళు అలెర్ట్ అయిపోయారు.అవకాశం కోసం చూస్తున్నారు.ఇంతలో ఉగాది సందర్భం వచ్చింది.తెలుగు కొత్త సంవత్సరాది సందర్భంగా ఉగాదికి ముందే ఆత్మీయులని,ప్రముఖుల్ని పిలిచి ఉగాది నిర్వహించుకోవడం వెంకయ్యకి ఎప్పటినుంచో వున్న అలవాటు.ఈసారి కూడా అలాగే చేశారు.

వెంకయ్య ఇంటిలో జరిగిన ఉగాది వేడుకలకు ప్రధాని మోడీ సహా,బీజేపీ ప్రముఖులు,ఢిల్లీలోని అన్ని రంగాలకు చెందిన తెలుగు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి.అందరూ సంతోషంగా ఆ వేడుకల్లో పాల్గొన్నారు.కానీ ఈ విషయాన్ని సదరు పార్టీ అనుకూల సోషల్ మీడియా ఎలా మార్చిందో తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే.వెంకయ్య ఇంట్లో ఓ వర్గానికి చెందిన న్యాయమూర్తులకు విందు ఇచ్చారని మీడియా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకొన్న వాట్సాప్ గ్రూప్స్ లో విరివిగా ప్రచారం చేయడం మొదలెట్టారు.అందులో ఏ భయం లేకుండా న్యాయమూర్తుల పేర్లు కూడా ప్రస్తావించి,వారంతా వెంకయ్య చెప్పినట్టు చేస్తున్నారని కలరింగ్ ఇచ్చారు. వెంకయ్యని టార్గెట్ చేస్తున్నా దాని వల్ల న్యాయవ్యవస్థ ప్రతిష్ట కూడా దెబ్బ తింటోందన్న కనీస స్పృహ లేకుండా ఇష్టారాజ్యంగా రాసేస్తున్నారు.తెలుగు వాళ్ళు ఏ రంగంలో ఎదిగినా అభినందించాల్సిందిపోయి వారిని నైతికంగా ఇబ్బంది పెట్టేందుకు సాహసిస్తున్న వారిని,వారికి అండగా వుంటూ ఇంతదాకా తెచ్చిన పార్టీ అధినేతకు తగిన బుద్ధి చెప్పకపోతే సోషల్ మీడియా ముసుగులో మరింత మంది రెచ్చిపోయే ప్రమాదముంది.ఏదేమైనా చివరకు వెంకయ్య ఉగాది పండగ విషయాన్ని రచ్చ,రాజకీయం చేసే వారి మనసుకి పట్టిన బూజు వదలాలని ఆశిద్దాం.

SHARE