కాపు రిజర్వేషన్ ఉద్యమం మళ్లీ ఊపందుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి.ఇంతకుముందు సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ఇచ్చిన గడువు దగ్గరపడ్డంతో కాపునేతలు ఉద్యమ నిర్మాణం ,నిర్వహణపై మరోసారి దృష్టి పెట్టారు.ఇప్పటికే కాకినాడలో సమావేశమై జిల్లాలవారీ జాక్ లపై పని దాదాపుగా పూర్తి చేశారు.ఇప్పుడు నాయకత్వ పరంగా అనుసరించాల్సిన వ్యూహం గురించి కాపు పెద్దలు కుస్తీ పడుతున్నారు.ఇంతకు ముందు నిరాహారదీక్షలతో ఉద్యమాన్ని నడిపిన ముద్రగడ అప్పట్లోనే ఇక జాక్ నాయకత్వంలో పని చేస్తామని ప్రకటించారు.
కాపు రిజర్వేషన్ అంశంలో నివేదిక రూపొందించాల్సిన మంజునాథ కమిషన్ క్షేత్రస్థాయి అభిప్రాయసేకరణ పూర్తి చేయలేదు.ఈ టైములో ఉద్యమరీతి,ప్రభుత్వంతో అనుసరించాల్సిన విధానంపై ముద్రగడ చిరంజీవి,దాసరి నారాయణ రావు తో పాటు రేపు కాపు ముఖ్యులతో సమావేశమయ్యే అవకాశముందని తెలుస్తోంది.అయితే తనకి కులం,మతం అంటకట్టొద్దన్న పవన్ ని కాపు నేతలు తమ సమావేశానికి ఆహ్వానిస్తారా?ఆహ్వానించినా అయన వస్తారా? అన్న అంశాలు ఆసక్తి రేపుతున్నాయి .సమావేశానికి రాకపోయినా ఓ రాజకీయపార్టీ నేతగా అయన కాపు రిజర్వేషన్ అంశం లో తన అభిప్రాయం వెల్లడించాల్సి ఉంటుంది.
కాకినాడలో పవన్ హోదా పోరాట సభ పెట్టడం కాపుఉద్యమాన్ని చల్లారబరచడానికే అని కొందరు నాయకులు భావిస్తున్నారట. యువతని పవన్ హోదా ఉద్యమం వైపు ఆకర్షిస్తే పోరాటం కష్టమవుతుందని కూడా వారి ఆందోళన.అందుకే కాకినాడ సభలో కాపు రిజర్వేషన్ గురించి కూడా పవన్ మాట్లాడేలా ఒత్తిడి తేవాలని కులపెద్దలు భావిస్తున్నారు.ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే కాపు ఉద్యమం vs హోదా ఉద్యమం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.దాన్ని ఇటు పవన్,అటు కాపు ఉద్యమకారులు ఎలా అధిగమిస్తారా అన్నది ఆసక్తికర పరిణామం ..