Posted [relativedate]
అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె వెండితెర పరిచయం గురించి బాలీవుడ్ లో ఎన్నో ఊహాగానాలు వచ్చాయి.ఆమె ఈ సినిమాతో ఆ సినిమాతో తెర మీద కనిపిస్తారని మరెన్నో వార్తలు వచ్చాయి.ఎప్పటికప్పుడు అవన్నీ తేలిపోయాయి.చివరికిప్పుడు శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ సినీ రంగ ప్రవేశం గురించి గట్టి వార్త ఒకటి బయటకొచ్చింది.అందుకు సాక్ష్యంగా ఇటీవల జరిగిన ఓ ఫోటో షూట్ నిలుస్తోంది.ఆ ఫోటో షూట్ లో జాన్వీ కనిపించిన తీరు చూశాక ఇక సర్వం సిద్ధమన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న ఆ ఫోటో షూట్ సినిమా సన్నాహకాల్లో భాగమేనని తెలుస్తోంది.
ఇంతకీ జాన్వీ నటించబోతున్న సినిమా ఓ రీమేక్ అని సమాచారం.మరాఠి సూపర్ డూపర్ హిట్ చిత్రం సైరాట్ హిందీ రీమేక్ లో హీరోయిన్ గా జాన్వీ నటించబోతున్నట్టు బాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారట.షాహిద్ కపూర్ కజిన్ ఇషాన్ ఖట్టర్ ఈ సినిమాలో హీరో గా ఛాన్స్ దక్కించుకున్నారు.సినీ రంగ ప్రవేశం మీద ఆసక్తితో జాన్వీ ఇప్పటికే న్యూ యార్క్ ఫిలిం స్కూల్ లో శిక్షణ పొంది వచ్చింది.ఓ నూతన నటిగా ఆమె నుంచి పెద్ద అద్భుతాలు ఆశించలేకపోయినా అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా జాన్వీ మీద ప్రేక్షకులు భారీ అంచనాలే వేసుకుంటారు.ఆమె ఆ అంచనాల్ని అందుకోవాలని ఆశిద్దాం.