Posted [relativedate]
రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. అంచనాలకు అందకుండా చాలా జరుగుతుంటాయి. జయలలిత మరణం తర్వాత తమిళనాడు పాలిటిక్స్ లోనూ ఏమైనా జరగొచ్చన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా అన్నాడీఎంకే మొత్తం చిన్నమ్మ చేతుల్లోకి వచ్చేసిన తర్వాత.. సీఎం పన్నీర్ సెల్వం బలహీనపడ్డారు. ఆయన రిమోట్ సీఎం మాత్రమేనని.. పెత్తనమంతా శశిదేని ప్రచారం జరుగుతోంది.ఎందుకంటే మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఇప్పుడు చిన్నమ్మ గుప్పిట్లోకి వెళ్లిపోయారు. ఈపరిస్థితుల్లో సెల్వం కూడా చేయగలిగిందేమీ లేదు.
ఏ క్షణంలోనైనా చిన్నమ్మ … సెల్వంను దించేసి… సీఎం పీఠమెక్కుతారని అన్నాడీఎంకే శ్రేణులు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో శశిని ఎదుర్కోవడానికి సెల్వం కూడా మంచి ప్లాన్ రెడీ చేసుకున్నారట. ప్రతిపక్షనేత స్టాలిన్ తో ఆయన మిలాఖత్ అయ్యారన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ జరిగిందట. ఈమధ్య సీఎం పన్నీర్ సెల్వం కాన్వాయ్ కి.. స్టాలిన్ దారి ఇవ్వడం జస్ట్ చిన్న ఉదాహరణ మాత్రమేనట. ఫ్యూచర్ లోనూ సెల్వం కు దారి ఇవ్వబోయేది కూడా స్టాలినేనని ప్రచారం జరుగుతోంది.
ఒకవేళ శశి … సెల్వంను రాత్రికి రాత్రే దించేస్తే… ఆయన డీఎంకేలో చేరడం ఖాయమట. ఒకవేళ కుదిరితే స్టాలిన్ తో కలిసి… శశి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కూడా సెల్వం సారు వెనుకాడకపోవచ్చని సమాచారం. ఎందుకంటే సెల్వం వెంట ఎంత లేదన్నా 20 మంది ఎమ్మెల్యేలయినా వస్తారు. వారంతా సై అంటే చిన్నమ్మకు కచ్చితంగా ఇబ్బందులు తప్పవు. మొత్తానికి సాదాసీదాగా ఉండే సెల్వం … పెద్ద స్కెచ్చుతో శశికళకు స్పాట్ పెట్టడానికి రెడీగా ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.