సత్తా చాటలేకపోయిన స్టాలిన్!!

Posted February 15, 2017

stalin is failed in political modulation
అవకాశవాద రాజకీయాలు రాజ్యమేలుతున్న తరుణంలో అందివచ్చిన అవకాశాన్ని డీఎంకే చేజార్చుకుంది. అన్నాడీఎంకేలోని లుకలుకలు… డీఎంకేకు కలిసి వచ్చినా… దాన్ని ఉపయోగించుకోవడంలో దారుణంగా విఫలమైంది. తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకేకు 89 సీట్లున్నాయి. కాంగ్రెస్ కు 8 మందిఎమ్మెల్యేలున్నారు. మొత్తంగా 97 మంది బలం డీఎంకేకు ఉంది. మ్యాజిక్ ఫిగర్ కు 118 మంది కావాలి.

అమ్మ మరణానంతరం అన్నాడీఎంకేలో రచ్చ జరుగుతున్న తరుణంలో … అది కచ్చితంగా డీఎంకేకు కలిసి వచ్చే అంశమే. ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వ అనిశ్చితిపై గొంతెత్తాల్సిన డీఎంకే… అన్నాడీంకే అంతర్గత విషయాల్లో తలదూర్చబోమంటూ దూరం జరిగింది. ముఖ్యంగా భవిష్యత్తులో పెద్ద పదవి ఆశిస్తున్న స్టాలిన్ ఈ అవకాశాన్ని వదులుతున్నారు. తన నాయకత్వ పటిమకు ఇది పరీక్షా సమయం. ఈ తరుణంలో ఆయన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను .. డీఎంకేలోకి ఆకర్షిస్తే పరిణామాలు వేరే రకంగా ఉండేవి. ఎంతసేపు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని లీకులు ఇచ్చారు తప్పితే.. నిజంగానే ఉన్నారా లేదా అన్నది క్లారిటీ లేదు. ఇక పన్నీర్ సెల్వం ప్రభుత్వానికి మద్దతిస్తామంటూ చెప్పుకొచ్చారు తప్ప… అసలు సెల్వంకు అంత సీనుందా.. లేదా అన్నది ఆలోచించలేదు. పట్టుమని 10 మంది ఎమ్మెల్యేల మద్దతు సంపాదించలేకపోయిన సెల్వంకు… 97 మంది ఎమ్మెల్యేల మద్దతు ప్రకటించడమంటే ప్రస్తుత రాజకీయాల్లో చాలా ఆశ్చర్యాన్ని కలిగించే అంశం.

97 మంది ఎమ్మెల్యేలున్న డీఎంకేకు.. మరో 20 మంది ఎమ్మెల్యేలను లాగడం పెద్దవిషయం కాదు. కానీ ఆ దిశగా ఎందుకో స్టాలిన్ నిర్ణయం తీసుకోలేకపోయారు. ప్రభుత్వాన్ని పడగొడితే.. ప్రజా వ్యతిరేకత వస్తుందన్న సాకుతో దూరం జరిగారు. ఒకవేళ ఎమ్మెల్యేల మద్దతు సంపాదించి… ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే..తనపాలనతో ప్రజలను కన్విన్స్ చేసే అవకాశముంది. కానీ స్టాలిన్ ఆ పని చేయలేకపోయారు. భవిష్యత్తులో ప్రయోజనం కలుగుతుందని ఆశ పెట్టుకొని.. ప్రస్తుత పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవడంలో విఫలమయ్యారు. అందుకే చిన్నమ్మకు జైలు శిక్ష పడ్డా.. డీఎంకే క్యాడర్ లోనూ పెద్దగా ఉత్సాహం కనిపించడం లేదు.

SHARE