స్టాలిన్ ను ఊరిస్తున్న సీఎం సీటు!!

Posted February 13, 2017

stalin is found of cm chair
పన్నీర్ సెల్వం, శశికళ … ఎవరి ప్రయత్నాలు వారుంటే.. ఇటు స్టాలిన్ కూడా వ్యూహరచనలు చేస్తున్నారు. పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. అంతేకాదు ఈ మధ్య డీఎంకే అధికారంలోకి వస్తుందంటూ పార్టీ క్యాడర్ కు లేఖలు రాశారని సమాచారం. అంటే సెల్వం, శశికళతో పాటు స్టాలిన్ కూడా సీఎం సీటుపై కన్నేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

డీఎంకే కూడా అధికారం కోసం ఆలోచించడం వెనక ఎమ్మెల్యేల సంఖ్యే కారణం. ఎందుకంటే ఆ పార్టీ దగ్గర ఇప్పుడు 89 మంది ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్ కు చెందిన 8 మంది ఎమ్మెల్యేలను కలుపుకుంటే సంఖ్య 97 కు చేరుతుంది. అంటే మరో 20 మంది ఎమ్మెల్యేలను ఆకర్షించగలిగితే అధికారం పెద్ద కష్టం కాదు. ఆదిశగానే ఇప్పటికే 20 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు స్టాలిన్ తో టచ్ లో ఉన్నారట. ఆయన ఆదేశాలకు అనుగుణంగా.. సెల్వంకు సపోర్ట్ ఇవ్వడానికైనా… లేకపోతే.. డీఎంకేలో చేరిపోవడానికైనా .. దేనికైనా సిద్ధంగా ఉన్నారని టాక్. ఇప్పుడున్న పరిస్థితుల్లో శశికళ, సెల్వం కంటే.. స్టాలిన్ కు బలనిరూపణ పెద్ద కష్టం కాదన్నది ఆ పార్టీ నాయకుల వాదన.

ఇప్పుడు అధికారాన్ని చేపడితే ప్రజల్లో రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయనే … స్టాలిన్ డైలమాలో ఉన్నారట. ఒకవేళ పన్నీర్ సెల్వం సీఎం కాకపోతే.. తానే సీఎం కావాలన్నది స్టాలిన్ వ్యూహమని తెలుస్తోంది. అయితే ముందు సెల్వంకు సపోర్ట్ చేయడమే ఆయన ఫస్ట్ ప్రియారిటీ అని సమాచారం. ఒకవేళ అనుకోని పరిస్థితులు ఎదురై.. శశికళ సీఎం అయితే మాత్రం .. ఆమె ప్రభుత్వాన్ని కూల్చడానికి స్టాలిన్ ఏమాత్రం వెనుకాడబోరని టాక్.

ఇవన్నీ ఆలోలించే స్టాలిన్ తన ప్రయత్నాల్లో తాను ఉన్నారట. ఏవిధంగానైనా పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నారట. అందుకే ఇప్పట్నుంచే ఎమ్మెల్యేలను రిజర్వ్ లో పెట్టుకుంటున్నారని సమాచారం. అటు కరుణానిధి కూడా స్టాలిన్ ఆలోచనే కరెక్ట్ అని చెబుతున్నారట. అన్నీ కుదిరితే 6 నెలల్లోపే ఆయన సీఎం అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు డీఎంకే నాయకులు.

SHARE