సందీప్‌ కిషన్‌ పని బాగుంది!

Posted April 17, 2017

sundeep kishan tamil movie mayavan dubbed in telugu
యువ హీరో సందీప్‌ కిషన్‌ వరుస చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇటీవలే ‘నగరం’ చిత్రాన్ని విడుదల చేసిన సందీప్‌ త్వరలో ‘మాయవన్‌’ అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. తమిళంలో తెరకెక్కిన ‘నగరం’ తెలుగులో డబ్బింగ్‌ అయ్యింది. అలాగే ‘మాయవన్‌’ కూడా తమిళంలో తెరకెక్కి, తెలుగులో డబ్బింగ్‌ కాబోతుంది. తెలుగు కుర్రాడు వరుసగా తమిళ చిత్రాలు చేస్తూ వాటిని తెలుగులో డబ్బింగ్‌ చేయడం చాలా అరుదు. తమిళంలో మార్కెట్‌ కోసం, మంచి బిజినెస్‌ కోసం స్టార్‌ హీరోలు సైతం పోటీ పడుతున్న సమయంలో సందీప్‌ కిషన్‌ మాత్రం చాలా సునాయాసంగా తమిళంలో మంచి క్రేజ్‌ను దక్కించుకున్నాడు.

ఇక తెలుగు కుర్రాడు కనుక ఎలాగూ తెలుగులో సందీప్‌కు ఒక మంచి గుర్తింపు ఉంది. తెలుగు మరియు తమిళంలో వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సందీప్‌ కిషన్‌ను చూసి ఇతర యువ హీరోలు కుళ్లుకోవాల్సిందే. ఎందుకంటే ఇలా రెండు భాషల్లో క్రేజ్‌ను సంపాదించుకుంటూ, వరుసగా చిత్రాలను రెండు భాషల్లో విడుదల చేయడం అనేది చాలా అరుదు. అందుకే సందీప్‌ కిషన్‌ పని బాగుంది, అతడు భవిష్యత్తులో రెండు భాషల్లో కూడా స్టార్‌గా ఎదుగుతాడని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ యువ హీరో ప్రముఖ సినిమాటోగ్రఫర్‌ చోటాకే నాయుడు మేనల్లుడు అనే విషయం తెల్సిందే.

SHARE