రాంబాబు సక్సెస్‌ కాకుంటే మళ్లీ అదే గతి!

Posted April 17, 2017

sunil hopes on ungarala rambabu movie
ఎన్నో కష్టాలు పడ్డ తర్వాత టాలీవుడ్‌లో సునీల్‌కు కమెడియన్‌గా స్టార్‌ ఇమేజ్‌ దక్కింది. కమెడియన్‌గా టాప్‌లో ఉన్న సమయంలోనే సునీల్‌కు హీరోగా అవకాశాలు వచ్చాయి. హీరోగా సులువుగానే ఎంట్రీ దక్కినప్పటికి, హీరో ఇమేజ్‌ను కొసాగించుకోవడం, హీరోగా సక్సెస్‌లు సాధించడం సునీల్‌కు కత్తి మీద సాము అయ్యింది. ఇప్పటి వరకు హీరోగా చేసిన సినిమాల్లో సక్సెస్‌ల కంటే కూడా అధికంగా ఫ్లాప్‌లు ఉన్నాయి. అయినా కూడా హీరో ఇమేజ్‌ను వదులుకుని మళ్లీ కమెడియన్‌గా చేయడం ఇష్టం లేని సునీల్‌ హీరోగానే కొనసాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రస్తుతం సునీల్‌ ‘ఉంగరాల రాంబాబు’ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా సక్సెస్‌, ఫ్లాప్‌లపై సునీల్‌ కెరీర్‌ ఆధార పడి ఉంది. ఇప్పటికే ‘భీమవరం బుల్లోడు’, ‘మిస్టర్‌ పెళ్లి కొడుకు’, ‘కృష్ణాష్టమి’, ‘వీడు గోల్డ్‌ ఎహే’, ‘జక్కన్న’ చిత్రాలు అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాయి. ఇక ప్రస్తుతం చేతిలో ఉన్న ఒక్కగానొక్క చిత్రం ‘ఉంగరాల రాంబాబు’ ఈ సినిమా కూడా ఫలితం అటు ఇటు అయితే ఖచ్చితంగా సునీల్‌కు హీరోగా మళ్లీ అవకాశాలు రావడం అనేది దాదాపుగా అసాధ్యం అని సినీ వర్గాల వారు అంటున్నారు. అందుకే ‘ఉంగరాల రాంబాబు’ విషయంలో సునీల్‌ చాలా టెన్షన్‌ పడుతున్నాడు. మరి కొన్ని వారాల్లోనే సునీల్‌ కెరీర్‌ ఏంటో తేలిపోనుంది. రాంబాబు తర్వాత అయినా సునీల్‌ మళ్లీ కమెడియన్‌గా నటిస్తాడేమో చూడాలి.

SHARE