రాహుల్ ఆరోపణల్లో నిజమెంత.?

Posted December 22, 2016

supreme court cancel the prashant bhushan pil about on modiప్రశాంతభూషణ్ పిల్‌లో చూపించినవి అవే
► అవి సున్నా అని.. విశ్వసనీయమైనవి కావన్న సుప్రీం
► అవే ఆధారాలు మెహసానా సభలో చూపించిన రాహుల్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముడుపులు తీసుకున్నారని, అందుకు ఆధారాలు తన దగ్గర ఉన్నాయని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చెబుతున్నా.. అవన్నీ పనికిమాలినవని, జీరో అని, మాయ అని సుప్రీంకోర్టు ఇప్పటికే వాటిని డిస్మిస్ చేసేసింది. నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో పాటు పలువురు రాజకీయ నాయకులకు కార్పొరేట్ పెద్దలు ముడుపులు చెల్లించారని ఆరోపిస్తూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషణ్ గతంలో పిల్ దాఖలు చేశారు. అప్పట్లో ఆయన బయటపెట్టిన పత్రాలనే ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా చూపించారు. కానీ, విచారణకు ఆదేశించడానికి ఈ పత్రాలు విశ్వసనీయమైనవి కావని సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది.

జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ అరుమ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం.. నవంబర్ 25న ఈ ఆదేశాలు జారీచేసింది. ప్రధానమంత్రిపై ఆరోపణలను నిరూపించాలంటే మరింత విశ్వసనీయమైన సాక్ష్యాలు తీసుకురావాలని ప్రశాంతభూషణ్‌కు తెలిపింది. ఆదిత్య బిర్లా, సహారా గ్రూపులు కొన్నేళ్ల పాటు రాజకీయ నాయకులకు భారీ మొత్తంలో లంచాలు ఇచ్చాయనడానికి ఈ పత్రాలు ఆధారమని ప్రశాంత భూషణ్ తన పిల్‌లో ఆరోపించారు. 2013 అక్టోబర్, నవంబర్ నెలల్లో గుజరాత్ సీఎంకు భారీ మొత్తం ఇచ్చినట్లు సహారా పత్రాల్లో ఉందన్నారు. అయితే.. ”మీరు సహారా పత్రాల మీద ఆధారపడుతున్నారా? వాళ్లెప్పుడూ అసలైన పత్రాలు ఇవ్వరు” అని జస్టిస్ ఖేహర్ చెప్పారు. తాము ఈ పత్రాలతో ఏమాత్రం సంతృప్తి చెందలేదని, అవినీతిపరుడైన ఏ వ్యక్తి అయినా ప్రధానమంత్రి పేరుతో ఒక ఎంట్రీ వేయొచ్చు గానీ, దాన్ని విశ్వసనీయమైన సాక్ష్యంగా పరిగణించలేమని ఆయన అన్నారు. ఈ కేసు విచారించడానికి తాము భయపడటం లేదని, కానీ కేవలం బిర్లా, సహారా గ్రూపుల నుంచి తెచ్చిన పత్రాలు ఏమాత్రం పనికిరానివని కోర్టు చెప్పింది. ఇవి సున్నా అని, మరింత విశ్వసనీయమైన సాక్ష్యాధారాలు తేవాలని సూచించింది.

కానీ సరిగ్గా ఇలా సుప్రీంకోర్టు తిరస్కరించిన ఆధారాలనే తీసుకొచ్చి రాహుల్ గాంధీ గుజరాత్‌లోని మెహసానాలో అవే ఆరోపణలు చేశారు. ఇప్పటికే రాహుల్ సృష్టిస్తానన్న ‘భూకంపం’ గురించి సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఇప్పుడు ఇలా సుప్రీంకోర్టు తిరస్కరించిన ఆధారాలు తీసుకొచ్చి ఆరోపణలు చేయడంతో అవి కూడా తేలిపోయినట్లయ్యాయి.

SHARE