సర్వేకి పుష్కర బ్రేక్..

0
405

survey pushkara break
నవ్యాంధ్రలో ప్రతి కుటుంబం, వ్యక్తి సమగ్ర వివరాల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ప్రజా సాధికార సర్వేకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో సర్వేను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసినా సాఫ్ట్‌వేర్ సమస్యలతో తొలినాళ్లలో కాస్త ఇబ్బందులు ఎదురయ్యాయి. తరువాత ఆ ఇబ్బందులను అధిగమించి సర్వే కొనసాగించినా ఒక్కో ఇంటికి గంటకు పైగా సమయం పట్టడంతో ఎన్యూమరేటర్లు ఆశించిన లక్ష్యాలను సాధించలేకపోయారు. మరోవైపు మారు మూల గ్రామాలలో ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో సర్వర్‌లు పనిచేయలేదు. దీంతో కొంతమేర వివరాల సేకరణకు జాప్యం జరిగింది. ఇప్పటికే తొలివిడత సర్వే పూర్తయింది. జులై నెల 8వ తేదీ నుంచి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో సర్వే ఆరంభమైంది. మొదట్లో సర్వర్ సమస్యలు సర్వేకు ప్రతిబంధకంగా మారగా, చివర్లో ల్యాప్‌ట్యాబ్‌లు ఇబ్బందికరంగా మారాయి. గడచిన 23 రోజుల్లో రెండు జిల్లాల్లోని మొత్తం కుటుంబాల్లో పదోవంతు కుటుంబాల వివరాల్ని కూడా గణకులు నమోదు చేయలేకపోయారు. గుంటూరు జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 12.89 లక్షల కుటుంబాలుండగా కేవలం 81,383 కుటుంబాల వివరాల్ని సర్వేలో నమోదు చేశారు. అదేవిధంగా 48.89 లక్షల మంది జనాభా ఉండగా 2,53,199 మంది వివరాల్ని నమోదు చేశారు. కృష్ణా జిల్లాలో 11 లక్షల కుటుంబాలకు 1,42,021 కుటుంబాలు, 45.17 లక్షల మంది వ్యక్తులకు 3,68,500 మంది వివరాల్ని నమోదు చేశారు.

1వ తేదీ నుంచి సర్వేకు విరామం…
ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రజా సాధికార సర్వేకు విరామం ఇచ్చారు. సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీకి ఉపయోగించే ట్యాబ్‌లు, ఐరిష్ యంత్రాల ద్వారానే సాధికార సర్వే జరుగుతోంది. దీంతో సర్వేకు విరామం ఇచ్చి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం ఆగస్టు నెల 6 నుంచి 14వ తేదీ వరకు వరకు రెండోవిడత సర్వే జరుగుతుందని ప్రకటించింది. అయితే తొలివిడత సర్వేలో ఆశించిన ప్రగతి లేకపోవడంతో రెండోవిడత తేదీల్లో మార్పులు జరిగే అవకాశముందని తెలుస్తోంది. ఈనెల 12 నుంచి 23 వరకు కృష్ణా పుష్కరాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు, కృష్ణా జిల్లాలో సర్వేకు అవరోధాలు ఎదురయ్యే అవకాశముంది. లక్షల సంఖ్యలో తరలివచ్చే భక్తులతో రెండు జిల్లాల్లో బిజీగా ఉండే అవకాశం ఉండడంతో ఈ రెండు జిల్లాల సర్వే షెడ్యూలును ప్రత్యేకంగా ప్రకటిస్తారా లేదా రాష్ట్రమంతటా ఒకేవిధానంలో సర్వే తేదీలను ప్రస్తుత జాప్యానికి అనుగుణంగా పొడగిస్తారా అనే చర్చ నడుస్తోంది. సమగ్ర సర్వేకు అవసరమైన సమయం కేటాయింపు కూడా ఎంతో కీలకమని ఉద్యోగులు చెబుతున్నారు.

Leave a Reply