అమెజాన్ పై నిషేధం?

Posted January 12, 2017

Sushma Swaraj warning Amazon Canada to remove insulting National Flag doormat
విదేశీ కంపెనీలు త‌మ అమ్మ‌కాల‌ను పెంచుకునేందుకు హిందూ దేవ‌తలు, భార‌త జాతీయ ప‌తాకాన్ని వాడుకుంటున్నాయి. బ‌ట్ట‌లు, ఇన్న‌ర్ వేర్లు, డోర్ మ్యాట్లు..ఎలా దేనిపై ప‌డితే దానిపై హిందూదేవ‌త‌లు, భార‌త జాతీయ జెండాను ప్రింట్ చేస్తున్నాయి. దీనిపై భార‌తీయులు ఎన్ని అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తున్నా.. మొద‌ట క్ష‌మాప‌ణ చెప్ప‌డం.. ఆ త‌ర్వాత ష‌రామమూలుగానే త‌మ దందా కొన‌సాగించ‌డం వారికి అల‌వాటుగా మారింది. తాజాగా ఓ ఆన్ లైన్ దిగ్గ‌జం కూడా మ‌రోసారి అదే త‌ప్పు చేసింది.

ఆన్ లైన్ షాపింగ్ లో నెంబ‌ర్ వ‌న్ గా ఉన్న అమెజాన్ త‌మ అమ్మ‌కాల‌ను పెంచుకునేందుకు చీప్ ట్రిక్కులు చేస్తోంది. అందుకోసం భార‌త జాతీయ జెండాను ఉప‌యోగించుకుంటోంది. విష‌య‌మేమిటంటే భార‌త జాతీయ ప‌తాకాన్ని డోర్ మ్యాట్స్ పై ప్రింట్ చేసి ఆన్ లైన్ లో విక్ర‌యిస్తోంది అమెజాన్. దీనిపై తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌య్యాయి. విష‌యం సుష్మా స్వ‌రాజ్ దృష్టికి వెళ్లింది. ఆ వార్త విన‌గానే సుష్మా ఒక్క‌సారి మండిపోయార‌ట‌. వెంట‌నే అమెజాన్ చర్యలపై స్పందించిన మంత్రి సుష్మా.. ఆ సంస్థ భారతీయులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణమే జాతీయ పతాకాన్ని అవమానించేలా ఉన్న ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేయాలని స్ప‌ష్టం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే అమెజాన్ ఉద్యోగులు, అధికారులకు భారత్ వీసా ఇచ్చే ప్రసక్తేలేదని గట్టిగా హెచ్చరించారు.

గతేడాది ఆగస్టులోనూ అమెజాన్ సంస్థ‌ హిందూ దేవుళ్ల ఫొటోలను ప్రింట్ చేసిన డోర్ మ్యాట్స్ ను ఆన్‌లైన్లో విక్రయించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సంస్థ ఈ ఉత్పత్తులను తమ వెబ్ పోర్టల్ నుంచి తొలగించింది. తాజాగా మరోసారి అమెజాన్ వివాదంలో చిక్కుకుంది. ఈ వివాదంపై అమెజాన్ అధికారులు సోషల్ మీడియాలో, అధికారికంగానూ ఎలాంటి ప్రకటన చేయలేదు.

అయితే అమెజాన్ స్పంద‌న కోసం సుష్మా స్వ‌రాజ్ ఎదురుచూస్తున్నార‌ట‌. వారు వెంట‌నే స్పందించ‌క‌పోతే విష‌యం చాలా దూరం వెళ్ల‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అమెజాన్ పై నిషేధం విధించినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదంటున్నారు విదేశాంగ శాఖ అధికారులు.

SHARE