వచ్చే ఎన్నికల్లో అధికారం మాట దేవుడెరుగు.. కనీసం ఉన్న సీట్లు నిలబెట్టుకోవడానికి తెలంగాణ కాంగ్రెస్ పడరాని పాట్లు పడుతోంది. అసెంబ్లీలో, పార్టీలో, చివరకు నిరసనల్లో కూడా హస్తం
నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పీసీసీ చీఫ్ ఆందోళన చేస్తుంటే.. సీనియర్లు ఆ వేపు చూడరు. ఇక సీనియర్ల మాటలకు పీసీసీ చీఫ్ పెద్ద విలువ ఇవ్వరు.
అధికారంలో ఉన్నప్పుడు ఈ గ్రూప్ పాలిటిక్స్ చెల్లాయి కానీ.. ఇప్పుడు తెలంగాణలో మనుగడే ప్రశ్నార్థకమౌతున్నా.. కాంగ్రెస్ నేతలు మాత్రం బుద్ధి మార్చుకోవడం లేదు.
తాము కలిసి పనిచేయాలంటే.. అధిష్ఠానం ఆధ్వర్యంలో సభ జరగాల్సిందేనని కాంగ్రెస్ నేతల డిసైడయ్యారు. అందుకే కేసీఆర్ వరంగల్ సభకు పోటీగా.. సీఎం సొంత గడ్డ అయిన
సంగారెడ్డిలో… రాహుల్ ని రప్పించి సభ జరపాలని నిర్ణయించారు. తెలంగాణ ఆవిర్భావ దినం జూన్ 2కు ఒకరోజు ముందే.. అంటే జూన్ 1న బహిరంగ సభకు రంగం సిద్ధమైంది. కానీ జన
సమీకరణ ఎంతవరకూ చేయగలరనేది విశ్లేషకుల్లో ఆసక్తిని పెంచుతోంది. క్షేత్రస్థాయిలో క్యాడర్ సభను విజయవంతం చేయగలదా.. సీనియర్లు సహకరిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వటం ద్వారా ఏపీలో పార్టీని సమాధి చేసేందుకు సైతం వెనుకాడని కాంగ్రెస్ అధినాయకత్వం అందుకు బదులుగా తెలంగాణ రాష్ట్రంలో తమకు తిరుగులేని
ప్రజాదరణ లభిస్తుందని ఆశించింది. అయితే.. అధినాయకత్వ ఆశలకు భిన్నంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ ఎస్ పార్టీ పవర్ లోకి
రావటం తెలిసిందే. అధికారంలోకి వచ్చినా.. ప్రజల్లో అంతగా ప్రభావం చూపించలేరన్న పిచ్చి లెక్కలో ఉన్న కాంగ్రెస్కు దిమ్మ తిరిగిపోయేలా కేసీఆర్ పన్నుతున్న వ్యూహాలతో ఆ పార్టీ
నేతల్లో నిరాశ.. నిస్పృహల్లో కూరుకుపోతున్న పరిస్థితి. రోజులు గడుస్తున్నకొద్దీ.. అంతకంతకూ బలోపేతం అవుతున్న తెలంగాణ అధికారపక్షానికి చెక్ చెప్పేలా.. సంగారెడ్డి శంఖారావం
ఉండాలని కాంగ్రెస్ నేతలు పట్టుదలగా ఉన్నారు.