గవర్నర్ మొగ్గు ఎటు?

Posted February 15, 2017

tamilandu governor decision pending
శశికళకు జైలుకెళ్లాల్సి రావడంతో ఇప్పుడు బాల్ గవర్నర్ విద్యాసాగర్ రావు కోర్టులోకి వచ్చి పడింది. బల నిరూపణపై ఎవరికి అవకాశమివ్వాలో ఆయనే నిర్ణయించనున్నారు. మొత్తానికి తమిళనాడు రాజకీయాలకు ఆయనే కేంద్రబిందువుగా మారారు. నిపుణుల అంచనా ప్రకారం ప్రస్తుతం ఆయన ముందు నాలుగు మార్గాలు కనిపిస్తున్నాయి.

1 ముఖ్యమంత్రి పదవి కోసం మళ్లీ ఇద్దరు నాయకులు పోటీపడుతున్నపుడు.. వారిలో ఎవరో ఒకరిని ప్రభుత్వ ఏర్పాటుకు ఎంపిక చేసే అధికారం గవర్నర్‌కు ఉంది. అంటే.. పన్నీర్‌ సెల్వం, పళనిస్వామిల్లో ఎవరో ఒకరిని తొలుత ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి.. ఆ తర్వాత సభలో మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా నిర్దేశించవచ్చు.

2 రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిని ఎన్నుకుని, ఆ పేరును తనకు తెలియజేయాల్సిందిగా శాసన సభను గవర్నర్‌ కోరవచ్చు.

3. ఒకవేళ ఇరు వర్గాలు.. సీఎం పదవి చేపట్టడానికి తమకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పినట్లయితే, గవర్నర్‌ అందుకు సంబంధించిన నిర్ణయాన్ని శాసనసభకు వదిలిపెట్టవచ్చు.
4. మరో కీలకమైన మార్గం.. రాష్ట్ర సీఎం ఎంపిక కోసం రహస్య బ్యాలెట్‌ పద్ధతిలో ఓటింగ్‌ నిర్వహించడం. ఏ వర్గానికి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందనే దానిపై గందరగోళం తలెత్తినపుడు, దానిని పరిష్కరించలేనపుడు ఈ దారిని ఎంచుకోవచ్చు. రాజ్యాంగంలోని 175 (2) అధికరణ ప్రకారం.. శాసనసభ రహస్య బ్యాలెట్‌ ద్వారా తదుపరి ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సిందిగా గవర్నర్‌ కోరవచ్చు. అదే బలపరీక్ష అవుతుంది.

1998లో ఉత్తరప్రదేశ్‌లో జగదాంబికాపాల్‌ ఉదంతంలో ఈ రహస్య బ్యాలెట్‌ పద్ధతిని చివరిసారిగా ఉపయోగించారు. జగదాంబి కాపాల్, కళ్యాణ్‌ సింగ్‌లలో ఒకరిని సీఎంగా ఎన్నుకోవడం కోసం శాసనసభలో బ్యాలెట్‌ బాక్సులు ఏర్పాటు చేశారు. అప్పుడు కళ్యాణ్‌ సింగ్‌ 29 ఓట్ల ఆధిక్యంతో గెలిచి సీఎం పదవి చేపట్టారు.

అన్నీ మార్గాల్లో మొదటి మార్గాన్నే గవర్నర్ విద్యాసాగర్ రావు ఎంచుకోవచ్చని భావిస్తున్నారు. మొదట పన్నీర్ సెల్వంకే అవకాశం ఇవ్వొచ్చని తెలుస్తోంది. అయితే పళనిస్వామి కూడా తమకు మెజార్టీ ఉందని చెబుతున్నారు కాబట్టి… ఆయనవైపు కూడా మొగ్గుచూపే అవకాశం లేకపోలేదు. అయితే గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది త్వరలోనే తేలిపోనుంది.

SHARE