Posted [relativedate]
ఒక తమిళనాడు ముఖ్యమంత్రి గతంలో ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్లారంటే అదిచాలా పెద్ద వార్త. ఎందుకంటే తమిళనాడు సీఎంలు ఎవరైనా ఢిల్లీకి వెళ్లరు. ఏదైనా పని కావాలంటే ఢిల్లీ వాళ్లే తమిళనాడుకు వచ్చి ఆ పని చేసి పెట్టి వెళ్తారని టాక్. గతంలో అటు కరుణానిధి కానీ, ఇటు జయలలిత కానీ.. పెద్దగా ఎప్పుడూ ఢిల్లీ వెళ్లిన సందర్భాలు లేవు. రాష్ట్రానికి సంబంధించిన పనుల విషయంలో కేంద్రపెద్దలకు హింట్ ఇచ్చేస్తే.. వారే చెన్నై వచ్చి పనులు చేసి పెట్టేవారు.
తమిళనాడులో ఇప్పుడు సీన్ రివర్సయ్యింది. సీఎం పన్నీర్ సెల్వం ఢిల్లీ వెళ్లారు. అటు శశికళ వర్గం హడావిడి చేస్తున్న నేపథ్యంలోనే ఈ ఢిల్లీ టూర్ జరిగిందని టాక్. పదవిని కాపాడుకోవడానికి సెల్వం సారు.. హస్తినకు వెళ్లారన్న పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే అధికారికంగా మాత్రం తుపాన్ నష్టానికి సంబంధించిన సాయం కోరడానికే సెల్వం ఢిల్లీ వెళ్లారని తెలిసింది. కానీ అందులో వాస్తవం ఉండకపోవచ్చంటున్నారు విశ్లేషకులు.
తమిళనాడులో పొలిటికల్ హీట్ పెరిగిన తరుణంలో మోడీ అండ కోసమే సెల్వం ఢిల్లీకి వెళ్లారన్న వాదన కరెక్టేనన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అంతేకాదు పన్నీర్ సెల్వం అయినా… ఆయన స్థానంలో ఇంకెవరు ముఖ్యమంత్రిగా వచ్చినా… ఇక ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు తప్పవంటున్నారు ఎక్స్ పర్ట్స్. అలా ఢిల్లీకి వచ్చేలా కేంద్రపెద్దలే చేస్తున్నారని తమిళ తంబీలు గుసగుసలాడుకుంటున్నారు.