జాతస్య మరణంధృవం …పుట్టిన వాడికి మరణం తప్పదు.భగవద్గీత లోని ఈ శ్లోకం మానవ జీవితాన్ని అత్యంత సరళంగా చెప్పేసింది ఎవరి జీవితానికైనా పుట్టుక మొదటి ఘట్టం .మరణం అంతిమ ఘట్టం ..ఆ ఘట్టాలు ఎపుడు ఎలా వస్తాయో ఎవరికీ తెలియదు …అందుకే ఈ రెంటి మధ్య నాటకరంగాన్ని హాయిగా దున్నేస్తాం …మనచుట్టూ ఎంత మంది చనిపోతున్నా…మనసు మాత్రం మనం శాశ్వతమనే నమ్మేస్తుంది.ఆ నమ్మకమే..మన బతుకుబండికి ఇంధనం…
బతుకుతామనే ఆ నమ్మకమే ఛిద్రమైతే …కళ్ళముందే మృత్యు వు మీద కు విరుచుకుపడుతుంటే ….ఏ హృదయమైనా ఎంతగా విలవిల్లాడుతుందో ….ఏ మనిషి అయినా ఎంతగా తల్లడిల్లిపోతాడో …ఆ మృత్యు రూపంలో వచ్చేది కూడా తనలాంటి మరో మనిషే అయితే …ఏకారణంలేకుండా ప్రాణాల్ని చిదిమేస్తుంటే …ఊహించుకొంటేనే గుండె భారమవుతోంది.ఈ పరిస్థితులనే ఎదుర్కొంది.ఢాకా లో ఉగ్ర బీభత్సానికి బలైపోయిన భారతీయ యువతి తరుషి…జన్మనిచ్చిన తండ్రికి ఆమె చెప్పిన చివరిమాటలివే…’మమ్మల్ని ఒకరి తర్వాత మరొకర్ని చంపేస్తారు’.ఎంత హృదయ విదారకం…నేను చనిపోతా అన్న ఓ బిడ్డ మాట విన్న తండ్రి పరిస్థితి ఏంటి ?ఇలాంటివే ఎన్నో వ్యధలు…మొన్న పారిస్ ,నిన్న టర్కీ ,నేడు ఢాకా …మృత్యు కవాతు చేస్తున్న ఉగ్రమూకలకు ఏంచెప్తే ఈ కన్నీటి వ్యధలు అర్ధం అవుతాయి ?మృత్యువు ఆవహించిన రాక్షసులు కళ్ళు తెరచుకుంటాయి ?తన పేరు చెప్పి మారణకాండ చేసేవాళ్ళని నిజంగా దేవుడు చూస్తూ ఊరుకుంటాడా?
ఏదిఏమైనా ఇలాంటి కష్టం ఎవరికీ రాకూడదు…పుట్టిన వెంటనే మనిషిని నీడలా వెంటాడే మృత్యువు…ఎప్పుడైనా ఆ మనిషిని తన గాడ కౌగిలిలో ఉక్కిరి బిక్కిరి చేయొచ్చు …అయినా ఫర్లేదు..కానీ ఆ మృత్యువు …కంటి కెదురుగా కనబడ కుండా ఉంటే చాలు …ఉగ్రభూతమై కబళించకుండా ఉంటే చాలు …చాలు…చాలు….