హస్తం గొంగళి ఎక్కడ వేస్తే అక్కడే..!

Posted [relativedate]

tcongress political leaders fight for chief minister candidateపదేళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించారు. విభజన సమస్యను విజయవంతంగా దశాబ్ద కాలం పెండింగ్ లో పెట్టారు. కానీ చివర్లో మాత్రం హడావిడిగా నిర్ణయం తీసుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రంలో కూడా అధికారం కోల్పోయారు. ఏపీలో రాజకీయ భవిష్యత్తును త్యాగం చేసి మరీ.. తెలంగాణలో అధికారంలోకి వద్దామనుకున్న కాంగ్రెస్ కలలు కల్లలయ్యాయి. ఇంత జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు సద్దుమణగలేదు. తెలంగాణలో ఎన్నికలు ముంచుకొస్తున్నా.. అంతర్గత కలహాలతోనే నేతలు పొద్దుపొచ్చుతున్నారు.

టీఆర్ఎస్ పై పోరు భేరి మోగించాలని ఇటీవల జరిగిన టీకాంగ్రెస్ సీనియర్ల మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు. ఇది అవుట్ కమ్. కానీ ఇంటర్నల్ గా సమావేశంలో చాలా రచ్చ జరిగింది. సీనియర్లంతా పీసీసీని టార్గెట్ చేయడంతో ఉత్తమ్ డిఫెన్స్ లో పడిపోయారు. ఓ దశలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఉత్తమ్ పీసీసీ చీఫ్ పదవి అక్కర్లేదని, ఇప్పుడే రాజీనామా చేస్తాననే సరికి సీనియర్లు కాస్త తగ్గారు. ఎవరో ఒకరిపై నింద నెట్టేయడమే కానీ.. సీనియర్లు మాత్రం తమవంతుగా పార్టీ బలోపేతానికి ఏం కృషి చేస్తున్నారో ఎవరూ చెప్పలేకపోయారు.

ఎన్నికలకు ఇంకా రెండేళ్లే సమయముంది కాబట్టి కలిసికట్టుగా ముందుకు సాగాలని ఒట్లు పెట్టుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆచరణలో ఈ ఐక్యత సాధ్యమేనా అన్న సందేహాలకు కొదువలేదు. ఎందుకంటే 2014 ఎన్నికల సమయంలో కూడా గ్రూపు తగాదాలతో గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నారు. ఓవైపు కేసీఆర్ ఒక్కడు ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తుంటే.. పదిహేను మంది సీనియర్లు తామే సీఎం అభ్యర్థులమని చెప్పుకుంటూ ప్రచారాన్ని గాలికొదిలేశారు. అందుకే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు కాకుండా.. తెచ్చామని చెప్పుకున్న టీఆర్ఎస్ కి జనం ఓటేశారు. కాంగ్రెస్ నేతలు పద్ధతి మార్చుకోకపోతే 2019లోనూ శృంగ భంగం తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here