Posted [relativedate]
ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు.. బీసీల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. వీటిలో ఆదరణ స్కీమ్ కు మంచి గుర్తింపు వచ్చింది. కులవృత్తులు, చేతిపనివారికి చేదోడుగా ఉండేలా ఆదరణ బాగా విజయవంతమైంది. ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలో ఈ స్కీమ్ పడకేసింది. ఇప్పుడు విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ ఆదరణ ప్రవేశపెడతానని చంద్రబాబు ప్రకటించారు. బీసీల ఆరాధ్యదైవం జ్యోతి బా పూలే జయంతి వేడుకల్లో బాబు చేసిన ప్రకటన.. బీసీ వర్గాల్లో కొత్త ఆశలు చిగురించేలా చేసింది.
టీడీపీకి మొదట్నుంచీ బీసీలే బలం. వారి ఓట్లతోనే ఎన్నో ఏళ్లు అధికారంలో ఉంది. చాలా నియోజకవర్గాలను కంచుకోటగా మార్చుకుంది. తర్వాత ఎన్ని పార్టీలు వచ్చినా టీడీపీకి ఉన్న బీసీల బలంంతో చెక్కు చెదరలేదు. కాంగ్రెస్ ఎంత ప్రయత్నించిన వీరిని టీడీపీకి దూరం చేయలేకపోయింది. మొదటిసారిగా బీసీలకు సాధికారత కల్పించిన టీడీపీ.. ఆ సామాజికవర్గ నేతలను ఉన్నత పదవుల్లో నియమించి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంది. దీంతో బీసీలు కూడా ఎవరేం చెప్పినా వినకుండా.. టీడీపీకే ఓటేస్తూ వచ్చారు.
దశాబ్దాలుగా అండగా ఉన్న బీసీలకు రుణం తీర్చుకోవాలని భావించిన చంద్రబాబు.. ఆదరణ పథకం పునరుద్ధరణపై దృష్టి పెట్టారు. తెలంగాణ బడ్జెట్లో కొన్ని చేతివత్తులు, కుల సంఘాల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించగా.. తాము మాత్రం జనాభాలో అధిక శాతం ఉన్న బీసీల తలసరి ఆదాయాన్ని పెంచడంపై దృష్టి పెట్టాలని చంద్రబాబు సన్నిహితులతో ప్రస్తావించారట. ఇప్పుడు విశాఖ సభలోనూ బీసీల గురించి మాట్లాడటంతో.. ఇక ఆదరణ పథకం ఖాయమని బీసీ వర్గాలు లెక్కలేసుకుంటున్నాయి.