ఆ యూనివర్సిటీ లో దేశం నేతలకి క్లాసులు…నేడే ప్రారంభం

Posted October 4, 2016

 tdp leaders training classes kl university
దేశం నేతలు సరికొత్త పాఠాలు నేర్చుకుంటున్నారు.మూడు రోజుల పాటు మొత్తం 20 గంటల్లో తాజా రాజకీయ పరిస్థితులు,హోదా,ప్యాకేజ్ వంటి అంశాల్లో అవగాహన పెంచుకుంటున్నారు.

టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తి కావస్తున్న సమయంలో పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్పీ ఛైర్మన్లు, మున్సిపల్ ఛైర్మన్లు తదితరులకు అక్టోబర్ 4 నుండి 6 వరకు మూడు రోజుల పాటు కేఎల్ యూనివర్సిటీలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ప్రజాప్రతినిధులకు నాయకత్వ లక్షణాల పెంపు, కొత్తగా వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం దాంతో పాటు ప్రజలకు మార్గదర్శకుడిగా ఉండేలా మన నేతల నడవడిక ఉండాలని పార్టీనేతలకు క్లాసుల్లో ఉద్భోద చేస్తున్నారు…

 తొలిరోజు … రాష్ట్ర విభజన సమయంలో ఉన్న పరిస్థితి, అప్పటి పరిస్థితిని , ఛాలెంజెస్ ని, వాటిని అధిగమించిన తీరు, కొత్త విధానాలతో ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే అంశాలను తొలిసెషన్ లో చర్చించనున్నారు.

సెకండ్ సెషన్ లో ప్రత్యేక ప్యాకేజీకి, హోదాకు ఉన్న తేడా , ప్యాకేజీతో వచ్చే లాభాలు, హోదా ఉన్న రాష్ట్రాలు పొందిన ప్రయోజనాలు, కేంద్రం ఏపీకి ప్రకటించిన ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇస్తున్న నిధులు వంటి అంశాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించనున్నారు.

 రెండవరోజు …. రాష్ట్ర విభజన సమయంలో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి సూచికలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకు సాధించిన జీడీపీ వృద్ధి, దానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఆర్థిక, ఆరోగ్య, సామాజిక సూచికల పెరుగుదలకు ప్రభుత్వం చేపట్టిన విధానాలను వివరించనున్నారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, ప్రణాళికలపై రెండవ సెషన్ లో చర్చించనున్నారు. ఇందుకోసం దేశంలో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ పైన చర్చించనున్నారు. వాటిలో ఆంధ్రప్రదేశ్ కు ఏది ప్రయోజనమో దానిని ఏపీ అడాప్ట్ చేసుకునేలా ప్రజాప్రతినిధులకు వివరించనున్నారు.

 మూడవరోజు …. నాయకత్వ లక్షణాలు ఏవిధంగా పెంచుకోవాలన్న అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇందులో ప్రతి ఒక్కరు రోజురోజుకి వస్తున్న కొత్త కొత్త టెక్నాలజీ, అవి మనకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి?, వాటిని మనం ఏవిధంగా అప్ డేట్ చేసుకోవాలి ? ప్రజల ఉన్నతి కోసం పనిచేసేలా ప్రతి నాయకుడికి ధ్యాస ఉండేలా వారి మనోభావాలను మార్చుకోవాలి. నాయకుడి గుణగణాలు, వారి వ్యక్తిత్వం ఎలా ఉండాలంటే ఆ నాయకుడి ప్రవర్తనతో ప్రజలు ఆయన్నే మార్గదర్శకుడిగా తీసుకునేలా నడుచుకోవాలి. మంచి నాయకుడు అని ప్రజలు అర్థం చేసుకునేలా నడవడిక ఉండాలి. మనం తీసుకున్న చర్యలను ప్రజలకు మరింత విపులంగా చెప్పడంతో పాటు ప్రభుత్వాన్ని, పార్టీని ప్రజలకు చేరువ చేయాలి.

 మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునేలా ప్రజలు సంతృప్తి చెందేలా కన్వర్జెన్స్ అండ్ కోఆర్డినేషన్ ఉండే విధంగా క్లాసుల్లో ప్రజా ప్రతినిధులకు ఉద్భోద చేయనున్నారు.

SHARE