దేశం ఎమ్మెల్యేలకు సంకటం ..కావాలా లోకేష్ సంతకం?

Posted October 4, 2016

 tdp mla need lokesh signature

చిన్నప్పుడు స్కూల్లో చదువుకునే రోజుల్లో అందరికీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనుభవం ఎదురయ్యేవుంటుంది.మార్కులు బాగా వస్తే ఎగురుకుంటూ ఇంటికెళ్లి ఆ రిపోర్ట్ పై నాన్న సంతకం అడగడం…బాగా రాకపోతే బిక్కుబిక్కుమంటూ సంతకం కోసం అమ్మ చాటున నక్కడం ..ఇపుడు తలుచుకుంటే ఆ విషయాలన్నీ సరదాగా అనిపించినా అప్పట్లో అవి ప్రాణ సంకటాలు.తాజాగా ఏపీ తెలుగుదేశం ఎమ్మెల్యేలకు అదే అనుభవం ఎదురు కాబోతోంది.సర్వేలు,ర్యాంకుల వ్యవహారం మళ్లీ తెర మీదకొచ్చింది.ఆ ర్యాంకులు బయటికి వెల్లడిస్తే పార్టీకి ఆయా నియోజకవర్గాల్లో నష్టమన్న కారణంతో ఈసారి బాబు గారు స్టైల్ మార్చారు.సర్వేలు ఎప్పటిలాగానే చేస్తారు.ర్యాంకులు కూడా ఇస్తారు.అయితే అవి బయటపెట్టకుండా ఓ సీల్డ్ కవర్ లో సదరు ఎమ్మెల్యేకు అందిస్తారు.అపుడు ఏమవుతుంది?ర్యాంకులు బాగా వచ్చినోళ్ళు లీకులిస్తారు.రానివాళ్లు మౌనం వహిస్తారు.అక్కడితో అయిపోతే అనుకోవాల్సింది ఏముంది?అక్కడే వుంది అసలు ట్విస్ట్ .

ర్యాంకు ఏదైనా సరే ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకుని అధిష్టానాన్ని కలవాల్సిందేనట.అధిష్టానం అంటే ముఖ్యమంత్రి బాబే గానీ అయన 100 కి పైగా ఉన్న ఎమ్మెల్యేలతో ముఖాముఖి కలవడానికి సమయం కుదరకపోవచ్చు.అందుకనే ఆ భాధ్యతను చినబాబు లోకేష్ కి అప్పజెప్పినట్టు సమాచారం. బాబు గారు ఇచ్చిన ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకుని ఎమ్మెల్యేలు చినబాబుని కలవాలన్నమాట.ర్యాంకు బాగుంటే అయన విషెస్ లేదంటే క్లాస్ ..ఏదో ఒకటి అందుకుని బయటపడాల్సిందే. చిన్నప్పుడు నాన్న తిడితే ఫర్లేదు గానీ ఇప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద చినబాబుని సంతకం అడిగితే ఏమంటారో ఎలా మాట్లాడుతారోనని ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారట.పాపం ప్రజాక్షేత్రం లో పాస్ అయ్యి ఎమ్మెల్యేలు అయినా పరీక్షలు,ప్రోగ్రెస్ రిపోర్టుల గోల తప్పని నిత్య విద్యార్థులు ఈ నాయకులు..

SHARE