తన్నుకుంటున్న తమ్ముళ్లు…

tdp mlas fighting

అధికార పార్టీలోని తమ్ముళ్ళలో విభేదాలు రోడ్డున పడుతున్నాయి. పాత-కొత్త తమ్ముళ్ళలో ఆధిపత్య పోరాటాలు తారాస్ధాయికి చేరుకోవటంతోనే విభేదాలు కూడా నాలుగు గోడల మధ్య నుండి రోడ్డుపైకి వచ్చేస్తున్నాయి. మొన్న కర్నూలు జిల్లా లోని ఆళ్ళగడ్డ, నంధ్యాలలోని రెండు వర్గాలు భాహాటంగానే ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. వైసీపీలో నుండి టిడిపిలో చేరిన ఎంఎల్ఏలు, మొదటి నుండి టిడిపిలో ఉంటున్న నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల మధ్య ఆధిపత్య పోరాటాలు ఎక్కువైపోయాయి. ఆ మధ్య ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గంలో వైసీపీ నుండి వచ్చిన గొట్టిపాటి రవికుమార్, కరణం బలరాం వర్గాలు కొట్టుకున్నాయి. అదేవిధంగా, అనంతపురం జిల్లాలోని కదిరి నియోజకవర్గంలో వైసీపీ నుండి వచ్చిన ఎంఎల్ఏ అత్తార్ చాంద్ భాషాపైకి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కందిమళ్ల వెంకట శివరామ ప్రసాద్ వర్గీయులు దాడులు చేసారు.

కర్నూలు జిల్లాలోని కోడుమూరు వైసీపీ ఎంఎల్ఏ మణిగాంధి వర్గీయులపై టిడిపి వర్గాలు దాడులు చేస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని నర్సాపురం నియోజకవర్గంలో వైసీపీ నుండి కొత్తగా చేరిన కొత్తపల్లి సుబ్బారాయుడు వర్గీయులపై టిడిపి ఎంఎల్ఏ మాధవనాయడు వర్గీయులు దాడులు చేసారు. ఇక, కడప జిల్లాలోని బద్వేలు వైసీపీ ఎంఎల్ఏ జయరాములు టిడిపిలో చేరటం ఆ జిల్లాలోని తమ్ముళ్ళకు ఎవరికీ ఇష్టం లేదు. అయినా జయరాములు చేరటంతో బద్వేలులో జయరాములు వ ర్గీయులపైకి తమ్ముళ్ళు ఒంటికాలిపై లేస్తున్నారు. ఇక, జమ్మలమడుగు వైసీపీ ఎంఎల్ఏ ఆదినారాయణరెడ్డి టిడిపిలో చేరే విషయంలో పెద్ద ప్రహసనమే నడిచింది. దశాబ్దాల తరబడి పార్టీనే నమ్ముకుని ఉన్న రామసుబ్బారెడ్డిని కాదని పార్టీ నాయకత్వం ఆదిని పార్టీలోకి చేర్చుకున్నది. అక్కడి నుండి ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.

ఈ విధంగా వైసీపీ నుండి వచ్చిన ఎంఎల్ఏలు, నేతల విషయంలో టిడిపి ఎంఎల్ఏలు, నేతలు ఏ సందర్భం దొరికినా వదిలిపెట్టటం లేదు. మొన్ననే అన్నీ జిల్లాల్లోనూ ముగిసిన మినీ మహానాడులో వైసీపీ నుండి టిడిపిలో చేరిన ఎంఎల్ఏలను ఎవరినీ తమ్ముళ్లు సమావేశాల్లో పాల్గొనేందుకు అనుమతించలేదు. సమావేశాలకు వస్తే ప్రతిఘటన తప్పదని బహిరంగంగానే హెచ్చరించటం సర్వత్రా చర్చైంది. ఈ విషయాలన్నీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయడుకు తెలియనివి కావు. వైసీపీ ఎంఎల్ఏలు టిడిపిలో చేరిన కొత్తలో ఒకటి రెండు సంఘటనల్లో చంద్రబాబు ఇరు వర్గాల మధ్యా సయోధ్య చేద్దామని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దాంతో సిఎం కూడా ఆ వర్గాలను వారి ఖర్మకు వదిలిపెట్టారు.
దాంతో అప్పటి నుండి టిడిపి నేతలు వలస నేతలపై రెచ్చిపోతున్నారు. నంధ్యాల, ఆళ్ళగడ్డ, దర్శి, జమ్మలమడుగు లాంటి నియోజకవర్గాల్లో ఘర్షణలు పోలీసు స్టేషన్లకు కూడా ఎక్కుతున్నాయి. కొన్నిసార్లు పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టాల్సి వస్తోంది. ఈ పరిణామాలు ఇతర జిల్లాపైన కూడా ప్రభావం చూపుతోంది.

వలస వచ్చిన నేతలకు వైసీపీలో ఉండగా అనేక తాయిలాలు ప్రకటించి, ప్రలోభాలకు గురిచేసి టిడిపిలోకి లాక్కున్నారు. పార్టీ మారకముందు అధినేత గానీ లేక అధినేత తరపున గాని తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందిగా వలస ఎంఎల్ఏలు ఇపుడు పట్టుబడుతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం వారికి ఏదైనా లబ్ది చేకూరే పని చేద్దామని అధినేత ప్రయత్నిస్తే అందుకు టిడిపి నేతలు అంగీకరించటం లేదు. బద్వేలులో నియోజకవర్గంలోని వివిధ పనులను జయరాములుకే అప్పగిస్తుండటంతో మొదటి నుండి నియోజకవర్గంలో ఉన్న నేతలకు రుచిచటం లేదు. అందుకనే దాడులు చేస్తున్నారు. మంజూరైన పనులను కూడా కానీకుండా అడ్డుకుంటున్నారు. దాంతో ఇటువంటి ఘటనలు పార్టీలోనే కాకుండా ప్రభుత్వ అధికారులకు కూడా తలనొప్పులు తెస్తున్నాయి. జిల్లాలోని అధికారులు తాము ఎవరి మాట వినాలో అర్ధం కావటం లేదని వాపోతున్నారు. ఇరువైపుల నుండి తమపై వస్తున్న ఒత్తిళ్ళను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళుతున్నారు. ప్రకాశం జిల్లాలోని దర్శిలో డిఎస్పీ, సిఐ, ఆర్‌డిఒలను ఒకరు బదిలీ చేయిస్తే, మరొకరు బదిలీని ఆపుచేయిస్తున్నారు. బదిలీపై వెళితే ఒకరికి కోపం, అక్కడే ఉంటే ఇంకోరికి ఆగ్రహం. దాంతో ఏమిచేయాలో పాలుపోక కొన్ని జిల్లాల్లో మండల, నియోజకవర్గ స్ధాయి అధికారులు కొన్ని రోజులు శెలవుపై వెళుతున్నట్లు సమాచారం.

ప్రభుత్వాన్ని, పార్టీని పటిష్టం చేయవచ్చని, అదే సమయంలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని మానసికంగా దెబ్బతీయవచ్చని చంద్రబాబు యోచించారు. చంద్రబాబు ఆలోచనలు ఎంత వరకూ అమలవుతున్నాయో తెలియదు గానీ వలస నేతల రాకతో పార్టీలో, ప్రభుత్వంలో మాత్రం కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఈ తలనొప్పులు ఆరంభం మాత్రమే. మరో ఏడాది గడిస్తే చాలు ఈ తలనొప్పులు మరింత ముదిరే అవకాశాలున్నాయి. ఇపుడు పనులు, లబ్ది కోసం జరుగుతున్న ఘర్షణలు, ఏడాది తరువాత నుండి రాబోయే ఎన్నికల్లో టిక్కెట్ల కోసం మొదలవుతాయి. దానికితోడు నియోజకవర్గాల సంఖ్య గనుక పెరగకపోతే అప్పుడుంటుంది టిడిపిలో అసలు సంగతి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here