కేంద్రంతో కయ్యమా ..నెయ్యమా?దేశం వ్యూహమేంటి?

 tdp war or friendship central govt what tdp plan
ఏపికి ప్రత్యేక హోదా దక్కడం లేదన్న ప్రచారంతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై నిరసనలుచేస్తూ టిడిపి నేతలు ప్రదర్శిస్తున్న దూకుడు వ్యూహంలో భాగమా లేక తెగువతో చేస్తున్న పోరాటమా అన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. ఇదే దూకుడుతో బిజెపితో ఉన్న బాంధవ్యాలతో టిడిపి దూరం అవుతుందా లేక జాతీయ ప్రయోజనాల పేరుతో కొనసాగుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఏపికి ప్రత్యేక హోదా కోసం కేంద్ర కేబినేట్ నుంచి టిడిపి ఎంపీలు బయటకు వస్తునే ఆ పార్టీకి చిత్తశుద్ధి ఉన్నట్లు రుజువవుతుందని ఏపిలోని ప్రతిపక్షపార్టీలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కేంద్రంలోని బిజెపిపై ఏపికి ప్రత్యేక హోదా విషయంలో టిడిపి నేతలు చేస్తున్న విమర్శలు వ్యూహంలో భాగమేనా అన్న చర్చ సాగుతోంది. ఏపికి ప్రత్యేక హోదాపై ఆందోళనలను ప్రతిపక్షాలు ఉధృతం చేస్తున్న నేపథ్యంలో ఆ ఆపవాదు నుంచి తప్పించుకొనేందుకేనా టిడిపి ఈ విమర్శల దూకుడు ప్రదర్శిస్తోందన్న చర్చ ప్రస్తుతం కొనసాగుతోంది. ఇందుకు కారణాలు లేకపోలేదని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

గత పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడా ఏపికి ప్రత్యేక హోదా దక్కదన్న ప్రచారం ఊపందుకొంది. నాడు కూడా కేంద్రంపై ఏపిలోని ప్రతిపక్షపార్టీలు విరుచుకుపడ్డాయి. ఆ తరువాత కాస్త ఆలస్యమైనా టిడిపి ఎంపీలు కూడా కేంద్రం వైఖరిపై మండిపడ్డారు. అంతేకాకుండా బిజెపిపై తీరుపైనా మండిపడ్డారు. ఇద్దంతా నాడు ప్రత్యేక హోదాపై చర్చకొనసాగినంతకాలం సాగింది. ఆ తరువాత మళ్లీ కేంద్రంలోని బిజెపి సర్కార్‌తో టిడిపి చెట్టాపట్టాలేసుకొని తిరిగింది. మొన్నటి రాజ్యసభ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా సురేష్‌ప్రభుకు టిడిపి అవకాశమిచ్చింది. ప్రస్తుతం మళ్లీ ఏపికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం నుంచి వస్తున్న ప్రకటనల నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏపికి ప్రత్యేక హోదాకోసం ఏపి రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ ఉద్యమ బాట పడుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఢిల్లీలో జాతీయ పార్టీల నేతలతో మంతనాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

మరోవైపు ఉమ్మడి రాష్ట్రంలో అధికారం చలాయించి ప్రస్తుతం చట్టసభల్లో ప్రాతినిధ్యం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ సైతం తాను తిరిగి రాష్ట్రంలో బలపడేందుకు ఏపికి ప్రత్యేక హోదా అస్త్రానే అందుకొంది. ఆ పార్టీ రాజ్యసభసభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్‌బిల్లుతోనే ఏపీలో మళ్లీ ప్రత్యే హోదా వేడి రాజుకొన్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే సిపిఐ పార్టీ ఏపికి ప్రత్యేక హోదా కోసం గతంలో రాష్ట్రబంద్‌లకు పిలుపునిచ్చి ఇటీవల అర్థనగ్న ప్రదర్శలు కూడా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టింది. సిపిఎం పార్టీ నిరాహారదీక్షలకు కూడా దిగింది. ఇలా ఏపికి ప్రత్యేక హోదా విషయంలో ఏపిలోని అన్ని పార్టీలు ఉద్యమిస్తున్న తరుణంలో కేంద్రంతో జతకట్టిన అధికార టిడిపి మౌనం దాల్చితే ఆ పార్టీకి తీవ్రనష్టం ఏర్పడుతుందన్నది రాజకీయ వర్గాల అంచనా. ఈ అంచనా మేరకు ప్రస్తుతం కేంద్రంపై టిడిపి నేతలు దూకుడు పెంచుతున్నా ఘాటైన విమర్శలు మాత్రం చేయడంలేదన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో మొదలైంది.

నిజంగా ఏపికి ప్రత్యేక హోదా విషయంలో టిడిపి తెగువ ప్రదర్శించదల్చితే మాత్రం కేంద్రం నుంచి బయటకు రావడం కూడా ఓ మార్గం అని పేర్కొంటున్నారు. అప్పుడైనా కేంద్రంలోని బిజెపితోపాటు ఏపి రాష్ట్రంలోని బిజెపి నాయకత్వం ఆత్మరక్షణలో పడుతుందని ప్రతిపక్ష పార్టీలు పేర్కొంటున్నాయి. ప్రత్యేక హోదా విషయంలో ప్రతిపక్షాలకు క్రెడిట్ దక్కకూడదన్న లక్ష్యం, తాను ప్రజాకోర్టులో దోషీగా నిలబడకూడదన్న వ్యూహం రెండు దాగివున్నాయని, అందుకే టిడిపి అధ్యక్షుడు కాకుండా ఆ పార్టీ నేతలు కేంద్రంలోని బిజెపి సర్కార్‌పై మండిపడుతున్నారని వారు గుర్తుచేస్తున్నారు.

గతంలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడా ఏపికి ప్రత్యేక హోదా రాదు అన్న ప్రచారం మొదలవడంతో ఆ రాష్ట్రంలోని ప్రతిపక్షపార్టీలన్నీ ఆందోళనలకు దిగాయి. అప్పుడు కూడా కేంద్రంలోని బిజెపి సర్కార్‌పై టిడిపి నేతలు విమర్శలకు దిగి ఆ తరువాత మౌనం దాల్చారు. అంతేకాకుండా ఆ తరువాత వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి, బిజెపి అవగాహనతో ముందుకెళ్లాలి. ఎమ్మెల్సీ సీటును బిజెపి అభ్యర్థికి టిడిపి కేటాయించింది. ప్రస్తుతం ఏపికి ప్రత్యేక హోదాకై కేంద్రంలోని బిజెపి సర్కార్‌పై గర్జిస్తున్న టిడిపి నేతల గర్జన తాత్కాలికమా లేక లక్ష్యసాధన దిశగా ఉంటుందా అన్నది చర్చాంశనీయంగా మారింది.

SHARE