జగన్ కోటగోడలు బద్దలు..ఆ మూడు చోట్ల టీడీపీ దే గెలుపు

Posted March 20, 2017

tdp won the elections in 3 places

వచ్చే ఎన్నికల్లో వైసీపీదే గెలుపు ,నేనే సీఎం అంటూ కలలు కంటున్న జగన్ కి టీడీపీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.జగన్ రాజకీయ కోటకి పునాదుల్లా వుంటూ వచ్చిన కడప,కర్నూల్,నెల్లూరు జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ తగిలింది.మూడు స్థానాల్లో టీడీపీ అభర్ధులు జయకేతనం ఎగురవేశారు.కర్నూల్,నెల్లూరు మాటెలా వున్నా కడపలో ఓటమితో వైసీపీ పునాదులు కదిలినట్టయింది.జగన్ స్పీడ్ కి బ్రేక్ వేయడానికి ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం చంద్రబాబు పటిష్ట వ్యూహంతో వైసీపీ కోటగోడల్ని బద్దలు కొట్టేశారు.కడపని వైసీపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా ప్రయోజనం లేకపోయింది.

నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఫలితం ముందుగా బయటికి వచ్చింది.ఇక్కడ టీడీపీ అభ్యర్థి వాకాటి నారాయణ రెడ్డి ఎనభై ఏడూ ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.ఆయనకి 462 ఓట్లు రాగా ,వైసీపీ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి కి మూడు వందల డెబ్భై ఎనిమిది మాత్రమే వచ్చాయి.ఇక కర్నూల్ లో టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి 56 ఓట్ల మెజారిటీ తో ఎమ్మెల్సీ పీఠాన్ని కైవసం చేసుకున్నారు.హోరాహోరీగా సాగిన ఈ సమరంలో భూమా,శిల్పా వర్గాలు కలిసి పనిచేయడంతో వైసీపీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డి కి ఓటమి తప్పలేదు.

ఇక కడపలో టీడీపీ తరపున బీటెక్ రవి,వైసీపీ తరపున జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి తలపడటంతో నామినేషన్ పర్వం నుంచే ఈ పోటీ టెన్షన్ రేకెత్తించింది.చివరకు కౌంటింగ్ లో కూడా ఓటింగ్ సరళి ఇద్దరినీ కంగారు పెట్టింది.వైసీపీ,టీడీపీ మధ్య గెలుపు దోబూచులాడింది.చివరకు టీడీపీనే గెలుపు వరించింది.తొలి రౌండ్ లో ఆధిక్యం నిలబెట్టుకున్న వైసీపీ ఆ తరువాత పరాజయం పాలైంది.33 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి విజయం సాధించారు.వై.ఎస్ కుటుంబంలోని వ్యక్తిపై టీడీపీ అభ్యర్థి గెలవడం ఇదే తొలిసారి.దీంతో తెలుగుతమ్ముళ్లు పండగ చేసుకుంటుంటే వైసీపీ డీలా పడిపోయింది.

SHARE