రాజ‌కీయాల్లోకి మ‌రో టీచ‌ర్!

Posted December 8, 2016

teacher in politics గ‌తంలో టీచ‌ర్లుగా ప‌నిచేసిన వారు చాలామంది తెలంగాణ రాజ‌కీయాల్లో చురుగ్గా ఉన్నారు. ప్ర‌స్తుతం శాస‌న‌మండ‌లి చీఫ్ విప్ గా ఉన్న సుధాక‌ర్ రెడ్డి గ‌తంలో టీచ‌ర్ గా ప‌నిచేసిన వారే. ఎమ్మెల్సీ పూల ర‌వీంద‌ర్ కూడా ఉపాధ్యాయ నేప‌థ్యం ఉన్న వారే. ఆ మాట‌కొస్తే కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, ప్ర‌స్తుత ప్ర‌తిప‌క్ష నేత జానారెడ్డి కూడా పిల్ల‌ల‌కు పాఠాలు చెప్పిన అనంత‌రం రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఇప్పుడు మ‌రో టీచ‌ర్ రాజ‌కీయాల్లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్నారు. ఆ ఉపాధ్యాయుడు మ‌రెవ‌రో కాదు పీఆర్టీయూ నేత‌గా అంద‌రికీ సుప‌రిచితులైన హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి.

పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఉన్న హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి పాల‌మూరు జిల్లాకు చెందిన వారు. ప్ర‌స్తుతం ఇదే జిల్లాలో ఆయ‌న ఎస్జీటీగా ప‌నిచేస్తున్నారు. తెలంగాణ ఉద్య‌మంలో టీచ‌ర్లకు నాయ‌క‌త్వం వ‌హించిన వారిలో ఆయ‌న కూడా ఒక‌రు. ఉద్య‌మంలో ఆ న‌లుగురుగా పేరొందిన స్వామిగౌడ్, దేవీప్ర‌సాద్,శ్రీనివాస్ గౌడ్, విఠ‌ల్ కు అత్యంత స‌న్నిహితుడు. గ‌త ఎన్నిక‌ల్లో హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి కూడా రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌న్న ప్ర‌చారం జ‌రిగింది. కానీ అప్పుడు సాధ్య‌ప‌డ‌లేదు. ఇప్పుడు ఆయ‌న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో దిగేందుకు సిద్ధ‌మ‌య్యారు.

మ‌హ‌బూబ్ న‌గ‌ర్, హైద‌రాబాద్, రంగారెడ్డి జిల్లాల ఉపాధ్యాయ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి ఎమ్మెల్సీ బ‌రిలోకి దిగుతున్నారు. అందుకోసం త‌న ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారు. ఎన్నిక‌ల్లో త‌న విజ‌యానికి ఎక్కువ అవ‌కాశాలున్నాయ‌ని అంద‌రూ అంచనా వేస్తున్నారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం కూడా హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి అభ్య‌ర్థిత్వంపై సానుకూలంగా ఉంది. మ‌రి ఎన్నిక‌ల్లో ఆయ‌న వ్యూహం ఫ‌లిస్తుందా.. లేదా అన్న‌ది త్వ‌ర‌లోనే తేల‌నుంది.

SHARE