Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇటీవల స్వదేశంలో ఆడిన అన్ని సిరీస్‌ల్లో నెగ్గి టీమిండియా తన సత్తా చాటిన విషయం తెలిసిందే. అయితే కోహ్లీ సేనకు ఈ మ్యాచ్‌లకు సంబంధించి బీసీసీఐ నుంచి అందాల్సిన మ్యాచ్ ఫీజు, బోనస్‌లు ఇంకా అందనట్లు సమాచారం. బీసీసీఐ, ఐసీసీల మధ్య నడుస్తున్న వివాదాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. గత ఆరు నెలలుగా టీమిండియా ఆటగాళ్లకు పారితోషకాలు రావాల్సి ఉందని తెలుస్తోంది.‘టెస్టు మ్యాచ్ ఆడిన అనంతరం 15 రోజుల్లోనో, నెలకో మాకు రావాల్సిన పారితోషకం వస్తుంది. అయితే ఈ సారి మరీ ఎక్కువ జాప్యం జరుగుతోంది. దీనికి గల కారణాలు మాత్రం తెలియదు.
ఇలా గతంలో ఎప్పుడూ జరగలేదు’ అని టీమిండియా జట్టు సభ్యుడు ఒకరు అన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. బీసీసీఐ పాలకుల కమిటీ, ఆఫీస్ బేరర్లు మధ్య వివాదాలు.. వీటికి తోడు రెవెన్యూ పరంగా బీసీసీఐ, ఐసీసీ మధ్య నెలకొన్న పోరు ఈ సమస్యకు కారణాలుగా తెలుస్తున్నాయి.నిబంధనల ప్రకారం టీమిండియా ఆటగాళ్లకు ఒక్కొక్కరికి టెస్టు మ్యాచ్‌కి రూ.15 లక్షలు, వన్డేకు రూ.6 లక్షలు, టీ20 మ్యాచ్‌కు రూ.3 లక్షలు చెల్లించాలి. మరోవైపు భారత మహిళల జట్టు సభ్యులకు కూడా చెల్లింపులు జరగలేదని తెలుస్తోంది.
2016-17 సీజన్లో టీమిండియా.. న్యూజిలాండ్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలపై సిరీస్‌లు నెగ్గిన విషయం తెలిసిందే.వరుస విజయాలు సాధించినా ఆటగాళ్లకు పారితోషికాలు మాత్రం అందడం లేదు. మొత్తం మీద కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా బోర్డులో అవినీతి నిర్మూలనకు కోర్టు ప్లాన్ చేస్తే.. ఇప్పుడు అసలుకే ఎసరొస్తోంది.