మోడీ టూర్ కు అంతా రెడీ…

0
444

 telanagana govt full arranged modi tour

ప్రధాని హోదాలో తొలిసారి రాష్ట్రానికి వస్తున్న నరేంద్ర మోదీకి ఘనస్వాగతం పలికేందుకు సర్కారు సమాయత్తమైంది. ప్రధాని పర్యటనకు కావాలసిన ఏర్పాట్లను శరవేగంతో పూర్తి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ వాటర్‌గ్రిడ్‌ను ప్రారంభించడానికి గజ్వేల్‌ మండలం కోమటిబండకు ప్రధాని మోదీ వస్తున్నారు. మిషన్‌భగీరథను ప్రారంభించిన అనంతరం జరిగే బహిరంగసభలో పాల్గొంటారు.

తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న మిషన్ భగీరధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తోంది. మిషన్‌ భగీరథలో భాగంగా తొలిదశలో గజ్వేల్‌ నియోజకవర్గంలోని 243 గ్రామాల్లో ఇంటింటికి నల్లా ద్వారా తాగునీటిని అందించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు .దాదాపు రెండు లక్షల మంది జనాన్ని సమీకరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వర్ష సూచన ఉండటంతో సభా ప్రాంగణమంతా వాటర్‌ ప్రూఫ్‌ టెంట్లను అమర్చారు. భారీ వర్షంలో సైతం సభను సజావుగా నిర్వహించడానికి ఈ ఏర్పాటు చేశారు. రెండు లక్షల కుర్చీలు తెప్పించారు. కోమటిబండలో నిర్మించిన వాటర్‌గ్రిడ్‌ సమీపంలో గల 250 ఎకరాలను చదును చేశారు. ఇందులో బహిరంగసభ కోసం 100 ఎకరాల స్థలం, మిగతాది వాహనాల పార్కింగ్‌ కొరకు ఎంపిక చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో వారం రోజులుగా రాత్రింబవళ్లు సుమారు వెయ్యి మంది కూలీలు శ్రమిస్తున్నారు.

ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తవుతున్నాయని తెలిపారు మంత్రి హరీశ్ రావు. సింగరేణి పవర్ ప్లాంట్ ను జాతికి అంకితం చేయడంతో పాటు ఐదు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని… ఆ తర్వాత జరిగే బహిరంగ సభలో సుమారు రెండు లక్షల మంది జనం సభకు హాజరయ్యే అవకాశముందన్నారు. మొత్తం నాలుగు హెలిప్యాడ్ లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సభలో ప్రధాని, సీఎం మాత్రమే ప్రసంగిస్తారని చెప్పారు. పార్కింగ్ కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నామన్నారు. 170 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. శాసన సభ, శాసన మండలి సభ్యులు అందరూ విచ్చేస్తారన్నారు. రోడ్డుపై ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని తెలిపారు. పూర్తి రెయిన్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు హరీశ్.

ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లు పరిశీలించేందుకు స్పెషల్‌ ప్రొటెక్షన గ్రూప్ అధికారుల హైదరాబాద్‌ చేరుకుంది. ప్రధాని పాల్గొనే కార్యక్రమాల రూట్‌మ్యాప్‌, వేదిక ఏర్పాటు, బందోబస్తు తదితర వివరాల్ని రాష్ట్ర పోలీస్‌ అధికారులతో ఎస్‌పీజీ అధికారులు చర్చించారు. బేగంపేట్‌ విమానాశ్రయం, గజ్వెల్‌లో ప్రధాని పాల్గొనే కార్యక్రమాల ప్రాంతాలు, ఎల్బీ స్టేడియం, పరిసర ప్రాం తాల్ని ఎస్‌పీజీ అధికారులు పరిశీలించారు. మొత్తంగా 5 వేల మంది పోలీస్‌ సిబ్బందిని భద్రతా విధులకు ఉపయోగిస్తున్నట్లు రాష్ట్ర పోలీస్‌ అధికారులు వివరించారు. ఎస్పీజీ డీఐజీ సెహ్వాంగ్‌ నెహెగల్‌ ఇక్కడే మకాం వేసి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కాగా ప్రధాని సమావేశం జరిగే ఎల్బీ స్టేడియానికి సమీపంలో రద్దీ ఎక్కువగా ఉండే పబ్లిక్‌గార్డెన, లుంబినీపార్కు తదితర ప్రాదేశాల్లో ఆంక్షలకు సంబంధించి పోలీసులు అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నారు.

Leave a Reply