తెలంగాణ – క్యాబినెట్ లో వెయిటింగ్ లిస్ట్ బారెడంత ..

0
587

telangana cabinet waiting list

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకోసం వరంగల్ జిల్లా శాసనసభ్యులు చకోరపక్షుల్లా ఎదురుచూస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ జరిగితే, ఎవరికీవారే తమకు మంత్రిపదవి ఖాయమన్న ధీమాతో ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చేసినా టీడీపీ నుంచి ఇటీవల టీఆర్ఎస్‌లో చేరిన పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, వరంగల్ తూర్పు శాసనసభ్యురాలు కొండా సురేఖలకు అవకాశం కల్పించవచ్చునని పార్టీవర్గాలంటున్నాయి. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మంత్రి పదవి కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

వరంగల్ జిల్లా నుంచి ఇప్పటికే ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, గిరిజనశాఖ మంత్రి చందులాల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ జరిగితే వీరిలో ఒకరికి ఉద్వాసన చెప్పి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొండా సురేఖలలో ఒకరికి ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం కల్పించవచ్చునని పార్టీ వర్గాలంటున్నాయి. ప్రస్తుత మంత్రివర్గంలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించ కపోవడం వల్ల విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో కొండా సురేఖను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయంటున్నారు. విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలంటే మహిళాకోటాలో బీసీ సామాజికవర్గానికి చెందిన కొండాసురేఖకు ఛాన్స్ ఇవ్వడమే బెటరన్న అభిప్రాయంతో పార్టీ నాయకత్వం ఉన్నదంటున్నారు.

అయితే కొండాసురేఖకు మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తే, ఎర్రబెల్లికి మంత్రిపదవి దక్కపోవచ్చునని అంటున్నారు. ఎర్రబెల్లి పార్టీలో చేరేసమయంలో ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తానని స్వయంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోందన్నారు. ఒకవేళ అదే నిజమైతే మంత్రివర్గ విస్తరణ లో ఎర్రబెల్లికి మంత్రిపదవి ఖాయంగా దక్కే అవకాశాలున్నాయంటున్నారు. ఒకవేళ ఎర్రబెల్లికి మంత్రిపదవి దక్కితే మరొకసారి కొండా సురేఖకు నిరాశే ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. వరంగల్ జిల్లా నుంచి ఇద్దరికి మించి మరొకరికి మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తే ఇతర జిల్లాల శాసనసభ్యులు, పార్టీ నేతల నుంచి తలనొప్పులెదురయ్యే అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి భావిస్తున్నారంటున్నారు.

ప్రస్తుత మంత్రివర్గంలో గ్రేటర్ హైదరాబాద్ నుంచి మాత్రమే నల్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తుండగా, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలకు నుంచి ఇద్దరేసి మంత్రులు కొనసాగుతున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన కడియం శ్రీహరి ఎమ్మెల్సీ కోటాలో మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారని, ప్రస్తుతం జిల్లా నుంచి చందులాల్ ఒక్కరే మంత్రివర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని జిల్లా పార్టీ నేతలు వాదిస్తున్నారు. అందువల్ల జిల్లా నుంచి మరొకరికి మంత్రిపదవి ఖాయమని పేర్కొంటున్నారు.

అయితే ఎవరి వాదనలెలా ఉన్నా, కడియం శ్రీహరి, చందులాల్‌తో పాటు మంత్రివర్గ విస్తరణ జరిగితే మరొకరి ముఖ్యమంత్రి అవకాశం కల్పిస్తారా? అన్నది ప్రశ్నార్ధాకంగా మారింది. అదేసమయంలో వీరిద్దరిలో ఒకర్ని తప్పించి మరొకరికి అవకాశం కల్పిస్తారా?, లేకపోతే ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ నుంచి నల్గురికి అవకాశం కల్పించినట్లుగానే వరంగల్ జిల్లా నుంచి నల్గురికి ఛాన్సిచ్చేందుకు సాహసిస్తారా? అన్నది తేలాల్సి ఉంది. ఎర్రబెల్లి, కొండా సురేఖలకు మంత్రివర్గంలో ముఖ్యమంత్రి అవకాశం కల్పిస్తే, పార్టీలో సీనియర్‌నైన తననెలా విస్మరిస్తారని దాస్యం వినయ్ భాస్కర్ పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించే అవకాశాలు లేకపోలేదని జిల్లా నేతలంటున్నారు. ఈ పరిస్థితుల్లో మంత్రివర్గ విస్తరణంటూ జరిగితే వరంగల్ జిల్లా నుంచి ఎవరికి ముఖ్యమంత్రి ఎవరికి అవకాశం కల్పిస్తారన్నది పార్టీ వర్గాల్లో హాట్ టాఫిక్‌గా మారింది.

Leave a Reply