ఎంసెట్ లీకేజ్ లో వాస్తవాలు.. 35 కోట్లు బేరాలు..?

0
494

telangana eamcet leakage 35 croresఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకయినట్లుగా సీఐడీ పూర్తి ఆధారాలతో నిర్ధారించింది. ప్రాథమిక విచారణలో కేవలం ఐదుగురు విద్యార్థులకు మాత్రమే పేపర్ లీకయిందని భావించినా, దర్యాప్తులో కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం 69 మంది విద్యార్థులకు ప్రశ్నాపత్రం లీకయిందని, ఇందుకు భారీ స్థాయిలో ఒప్పందం కుదిరిందని సీఐడీ నిర్ధారించింది. పీజీ మెట్ స్కాంలో కీలక సూత్రధారిగా ఉన్న రాజగోపాల్‌రెడ్డియే ఈ కుంభకోణంలోనూ ప్రధానపాత్ర పోషించినట్టు గుర్తించింది.

బెంగళూరు కేంద్రంగా దందా సాగించిన రాజగోపాల్‌రెడ్డి.. తన ఇద్దరు ఆసిస్టెంట్స్‌ తిరుమల్, విష్ణు, కన్సల్టెన్సీ నిర్వాహకుడు రమేష్‌తో కలిసి పేపర్ లీక్‌కు కుట్రలను రచించాడు. దీంట్లోభాగంగా రమేష్‌కు పరిచయం ఉన్న రెండు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులతో సంప్రదింపులు ప్రారంభించారు. తొలుత ఐదుగురు విద్యార్ధులను లక్ష్యంగా ఎంచుకున్నారు. వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన ఒకరు, పరకాలకు చెందిన మరొకరు, మహబూబాబాద్‌కు చెందిన మరో విద్యార్థి, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లకు చెందిన ఇద్దరు విద్యార్ధులను బుట్టలో వేసుకున్నారు.

వీరి తల్లిదండ్రులను ఎంసెట్-1 పరీక్ష జరిగిన తర్వాత సంప్రదించారు. ఫలితాలు చూసిన తర్వాత మాట్లాడుదాం అని వారు చెప్పారు. ఫలితాలు వచ్చాయి. ర్యాంకులు వేలల్లో ఉండటంతో లాభం లేదనుకున్న ఆ ఐదుగురు విద్యార్ధుల తల్లిదండ్రులు రమేష్‌తో మాట్లాడారు. ఇక్కడినుంచి రాజగోపాల్ రంగంలోకి దిగాడు. రమేష్, విష్ణు, తిరుమల్ ద్వారా కుంభకోణాన్ని అమలు చేశాడు. కేవలం ఐదుగురు విద్యార్ధులైతే గిట్టుబాటు కాదనుకొని, ఈ విద్యార్థుల ద్వారా కోచింగ్ సెంటర్లలో ఉన్న మిగతా 64 మందిని సంప్రదించేలా పథకం రూపొందించాడు. మీ మిత్రులకు సాయం చేస్తే వారు కూడా మీలాగే స్థిరపడతారు కదా అంటూ సలహాలు ఇప్పించారు. ఈ విధంగా రెండు కోచింగ్ సెంటర్లలో ఉన్న మొత్తం 69 మంది విద్యార్థులను, వారి తల్లిదండ్రులను రాజగోపాల్‌రెడ్డి విజయవంతంగా బుట్టలో వేశాడు. ఒక్కో విద్యార్థి నుంచి 50 లక్షలకు మొత్తం మీద దాదాపు 35 కోట్ల బేరం కుదిరినట్లుగా సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. అడ్వాన్స్‌గా ఒక్కొక్కరినుంచి రూ.10 లక్షలు తీసుకోవాలనుకున్న రాజగోపాల్ రెడ్డి ముఠా.. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రూ.7 కోట్లు వసూలు చేసినట్టు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.

పోటీ పరీక్షల లీకేజీల్లో ఆరితేరిన రాజగోపాల్‌రెడ్డి ముఠా ఎప్పటిలాగే ఈసారి కూడా ప్రశ్నాపత్రాలను ప్రచురించే ప్రెస్‌లో తమ మనిషిని ప్రవేశపెట్టి ఆ పని చేసి ఉంటుందని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కీలక ప్రవేశపరీక్షలు జరిగినా అక్కడ రాజగోపాల్ అండ్ గ్యాంగ్ లీకేజీ కుట్రకు పథకం రచిస్తుంది. ఏ యూనివర్సిటీ పోటీపరీక్షను నిర్వహిస్తోంది? అక్కడ డబ్బులకు అమ్ముడుపోయేవాళ్లు ఎవరు? ఎంతకు కొనవచ్చు? అన్న వివరాలను పరిశీలించి రంగంలోకి దిగుతుంది. 2014 పీజీ మెడికల్ ఎంట్రెన్స్ పరీక్షలోనూ రాజగోపాల్ ఇదే రీతిలో ప్రశ్నాపత్రాన్ని లీక్ చేశాడు. 50 కోట్లకు పైగా బేరం కుదుర్చుకొని చివర్లో ఇదే సీఐడీ అధికారులకు దొరికిపోయాడు. జేఎన్‌టీయూ నిర్వహించబోతున్న ఎంసెట్ ప్రశ్నాపత్రాలను ప్రచురించే ఢిల్లీలోని ప్రింటింగ్ ప్రెస్‌లో ఉద్యోగం కోసం లక్షలు పారేస్తాడు. ప్రింటింగ్ సెక్షన్‌లో ఉద్యోగం ఇవ్వండి చాలు అంటూ ప్రెస్ వాళ్లతో బేరాలు జరుపుతాడు. డ్రైవర్ రాజ్‌గోపాల్‌ రెడ్డి ఉద్యోగంలో చేరిపోతాడు. సరిగ్గా ప్రశ్నాపత్రం ప్రింటింగ్ సమయంలో ఎవరికీ దొరక్కుండా లోదుస్తుల్లో పేపర్‌ను దాచి రాజగోపాల్‌రెడ్డికి అందజేస్తాడు. ప్రశ్నాపత్రం ప్రింటింగ్ పూర్తయిన మూడో రోజు నుంచి పని మానేస్తున్నానని చెప్పి వెళ్లిపోతాడు. ఈ విధంగా రాజగోపాల్‌రెడ్డి డ్రైవరే ఈసారి పేపర్ లీక్ వ్యవహారంలో కూడా కీలకపాత్ర పోషించి ఉంటాడని సీఐడీ అనుమానిస్తోంది.

ఢిల్లీలోని ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రశ్నాపత్రాన్ని కొట్టేసిన రాజగోపాల్ రెడ్డి ముఠా బెంగళూరు, ముంబైల్లో రెండు అపార్ట్‌ మెంట్లను అద్దెకు తీసుకున్నట్టు సీఐడీ గుర్తించింది. 69మంది విద్యార్థులను ఎంసెట్-2 పరీక్షకు కొన్నిరోజుల ముందు బెంగళూరు, ముంబైల్లోని తన అడ్డాకు తరలించినట్టు భావిస్తోంది. ఈ నెల 9న ఎంసెట్-2 పరీక్ష ఉండగా 34మందిని ఈ నెల 4న ముంబైకి, 5వ తేదీన 35మందిని బెంగళూరుకు తరలించారు. వీరికి ప్రశ్నాపత్రాన్ని ఇచ్చి ప్రాక్టీస్ చేయించారు. సరిగ్గా పరీక్ష సమయానికి విద్యార్థులను వారి పరీక్ష కేంద్రాలకు చేరవేసినట్టు సీఐడీ అధికారులు తెలిపారు.

ప్రశ్నాపత్రం లీకేజీకి ప్రధాన సూత్రదారిగా అనుమానిస్తున్న రాజగోపాల్‌రెడ్డితో పాటు అతడి సహాయకులు విష్ణు, తిరుమల్‌ను పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. అలాగే కన్సల్టెన్సీ నిర్వాహకుడు రమేష్‌ను కూడా విజయవాడలో సీఐడీ అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఇద్దరు, ప్రింటింగ్ ప్రెస్‌లో సహకరించిన వ్యక్తి, జేఎన్‌టీయూలో గతంలో పనిచేసిన ఓ వ్యక్తి కూడా ఈ కుంభకోణంలో కీలకపాత్ర పోషించారని సీఐడీ భావిస్తోంది. వారి కోసం నాలుగు బృందాలు గాలిస్తున్నాయి.

Leave a Reply