తెలంగాణ లీడర్లు నిప్పు!!

Posted December 30, 2016

telangana leaders are perfectనేర సామ్రాజ్యంతో తెలుగు రాష్ట్రాలను గడగడలాడించి చివరకు కుక్కచావు చచ్చిన నయీం విషయంలో అనుకున్నదే జరిగింది. తెలంగాణ హోంశాఖ కొండను తవ్వి ఎలుకను పట్టింది. అదేంటంటే. నయీంకు అసలు పొలిటికల్ లీడర్లతో సంబంధాల్లేవట!! సీపీఐ నేత నారాయణ వేసిన పిటిషన్ పై తెలంగాణ హోంశాఖ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఇందులో ఆశ్చర్యమనిపించే అంశాలున్నాయి.

నయీం కేసుతో రాజకీయ నేతలు, పోలీసులకు సంబంధాలు లేవని హోంశాఖ హైకోర్టుకు తెలిపింది. టీడీపీ ఎమ్మెల్యే కృష్ణయ్యతో పాటు మరికొందరికి నోటీసులు ఇచ్చి విచారించామన్నారు. 175 కేసుల్లో 150 మంది అరెస్ట్ చేశామన్నారు. కానీ ఇప్పటివరకు అటు లీడర్లకు కానీ.. ఇటు పోలీసులకు గానీ నయీంతో లింకులున్నట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదట. అంతేకాదు రాజకీయ ప్రయోజనాల కోసమే నారాయణ ఈ పిటిషన్ వేశారని హోంశాఖ చెప్పుకొచ్చింది.

తెలంగాణ హోంశాఖ చెప్పిన ఈ అంశాలపై సెటైర్ల మీద సెటైర్లు పడుతున్నాయి. ఒకవైపు పేరు మోసిన బడా రాజకీయ నాయకులు .. నయీంతో సన్నిహితంగా మెలిగారని ప్రచారం జరిగింది. ఆ దిశగా ఆధారాలు కూడా దొరికాయని సమాచారం. కానీ ఎందుకనో ఆ విషయం మరుగున పడింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్భాటంగా వేసిన సిట్ కూడా ఏం చేయలేకపోయింది. అందుకే ఈ దర్యాప్తు.. ఈ హడావుడి అంతా ట్రాష్ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కొందరిని కాపాడడానికి ప్రభుత్వం ఇలాంటి స్టెప్ తీసుకుందట. ఎందుకంటే నయీంతో చాలా పార్టీల నాయకులకు సంబంధాలున్నాయి. అంతెందుకు.. అధికార పార్టీ నాయకులతోనూ క్లోజ్ రిలేషన్ ఉందని చెబుతుంటారు. వాళ్లంతా దోషులుగా తేలితే పార్టీ ఇమేజ్ కు దెబ్బ పడుతుంది. దీంతో ఈ తలనొప్పంతా ఎందుకు? లీడర్లు, పోలీస్ అధికారులను ఇందులో నుంచి మినహాయించాలని నిర్ణయించారట. వాళ్లంతా నిప్పు అని తేల్చేశారట. అందులో భాగంగానే నయీం కేసులో లీడర్లు, పోలీస్ అధికారులకు క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చారని టాక్.

SHARE