తెలంగాణ,మహారాష్ట్ర ల మధ్య రేపే కీలక ఒప్పందం ..

  telangana maharashtra govt agreement irrigation projectsకాళేశ్వరానికి అడ్డంకులు తొలగిపోనున్నాయి. గోదావరి నదిపై సర్కార్ రీడిజైన్ చేసిన ప్రాజెక్టుల నిర్మాణానికి లైన్ క్లియర్ కాబోతోంది. మహారాష్ట్రతో కీలక ఒప్పందాలు చేసుకునేందుకు రెడీ అయ్యారు సీఎం కేసీఆర్. మంగళవారం ముంబైలో ఒప్పందం చేసుకోనున్నారు.సీఎం వెంట మంత్రివర్గ సభ్యులు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు మహారాష్ట్ర వెళ్లనున్నారు. ముంబై సహ్యాద్రి గెస్ట్ హౌస్ వేదికగా జరగనున్న సమావేశంలో.. ప్రాజెక్టులపై అగ్రిమెంట్లు చేసుకోనున్నాయి రెండు రాష్ట్రాలు.
తమ్మిడిహట్టి, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో ముంపు ప్రాంతాలు, ఎత్తు విషయంలో రాష్ట్ర ఇరిగేషన్ శాఖాధికారులు రూపొందించిన డిజైన్లకు.. మహారాష్ట్ర అధికారులు అంగీకరించారు. దీంతో అక్కడి సర్కారు కూడా ఇందుకు అభ్యతరం చెప్పలేదు. గతంలోనే మహా సీఎం ఫడ్నవీస్ తో విస్తృతంగా చర్చించారు సీఎం కేసీఆర్. ఇపుడు తుది అగ్రిమెంట్లు కుదిరిన వెంటనే ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభం కానుంది.
ఇక సీఎం మహారాష్ట్ర టూర్ పై కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించడాన్ని తప్పుబట్టింది అధికారపార్టీ. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పై కాంగ్రెస్ పార్టీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు ఆ పార్టీ ఎంపీ వినోద్. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో కాంగ్రెస్ నేతలు.. ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు.
మహా ఒప్పందాన్ని ఒక సంబురంగా జరుపుకోవాలని భావిస్తోంది టీఆర్ఎస్. ఒప్పందం తర్వాత కేసీఆర్ ముంబైలోనే ఉంటారు. 24న మధ్యాహ్నం రెండు గంటలకు ముంబై నుంచి బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. ఎయిర్ పోర్ట్ లో సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు నేతలు. జిల్లాల నుంచి పెద్దఎత్తున రైతులను తరలించాలని నిర్ణయించారు. ఎయిర్ పోర్ట్ నుంచి క్యాంప్ ఆఫీస్ వరకు.. రైతులు, కళాకారులు, డప్పు చప్పుళ్లతో టీఆర్ఎస్ శ్రేణులు భారీ ఊరేగింపు నిర్వహించనున్నారు. స్వాగత ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షిస్తున్నారు.

SHARE