జిల్లాల పోరు తీవ్రం…

 telangana state warangal districts peoples districts warకొత్త జిల్లాల జాబితాలో చేర్చాలంటూ ఇటు వరంగల్ జిల్లాలోని జనగామ, అటు మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల ప్రజలు ఆందోళనలు చేపట్టారు. జనగామను జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ స్థానికులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. పెంబర్తి, రఘనాథపల్లి మండలాల్లో 1000 మంది విద్యార్థులు జనగామ జిల్లా కోసం ఆందోళనకు దిగారు. జనగామ ప్రాంతాన్ని ప్రతిపాదిత జిల్లాల జాబితాలో చేర్చకపోవడంపై జనగామ పట్టణంలో తీవ్రస్థాయిలో ఆందోళనలు ప్రారంభమయ్యాయి.

జనగామ జిల్లా సాధన ఐకాస ఇచ్చిన పిలుపు మేరకు వేలాదిమంది ప్రజలు వచ్చి రోడ్లను దిగ్బంధం చేశారు. వందలాది మంది మహిళలు బతుకమ్మలు, బోనాలతో ఆందోళనలో పాల్గొన్నారు. జిల్లా సాధన ఐకాస ఛైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డితో పాటు వందమంది ఐకాస, యువజన సంఘాల నాయకులు ఆర్టీసీ చౌరస్తా వద్ద దూసుకొచ్చారు. దీంతో ఆందోళనకారులు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది.  జనగామ మహబూబాబాద్, నర్సంపేట, ఏటూరునాగారం తదితర ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసు బలగాలు జనగామలో మోహరించాయి.

జిల్లా సాధన ఉద్యమం రణరంగంగా మారడంతో జనగామలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల పట్టణంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం గద్వాల డిపో నుంచి బస్సులు రాకుండా అడ్డుకున్నారు. అక్కడికి చేరుకున్న అఖిలపక్ష నాయకులు గద్వాల జిల్లా కావాలంటూ నినాదాలు చేశారు. వారికి మద్దతుగా స్థానికులు కూడా జైగద్వాల అంటూ నినాదాలు చేశారు. బంద్ నేపథ్యంలో బస్టాండ్ ప్రాంగణంలో పోలీసులు భారీగా మోహరించారు. బస్సులు డిపోనుంచి బయటకు రాకపోవడంతో పుష్కరాలకు వచ్చే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. 

SHARE